CM Revanth Reddy Tweet On paddy procurement : ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో (Agriculture Market Yard incident) జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి, రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు (Criminal cases) పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అడిషనల్ కలెక్టర్కు సీఎం రేవంత్ అభినందన : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను సీఎం అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల (paddy Procurement) విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజాగా సాగుతున్న యాసంగి ధాన్యం కొనుగోలు విషయంమై "ఎక్స్" వేదికగా సీఎం రేవంత్ స్పందించారు.
కొనుగోలు కేంద్రాల్లో నీరు అందుబాటులో ఉంచండి : మరోవైపు తాగు నీరు, ధాన్యం కొనుగోళ్లు, వేసవి చర్యలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనగోలు కేంద్రాల్లో తాగు నీరు, ఓఆర్ఎస్ను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తెలిపారు. వర్షాకాలం వచ్చేంత వరకు తాగు నీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
'మన ఊరు - మన బడి' పనులు చేపట్టేందుకు ఈసీ అనుమతిచ్చిందని సీఎస్ కలెక్టర్లతో తెలిపారు. నిధులు, అనుమతులు మంజూరైనందున పాఠశాలల్లో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజలకు, సిబ్బందికి దీనిపై అవగాహన పెంచాలి అని సీఎస్ సూచించారు.
Paddy Procurement Centers In Telangana : రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్నారు. 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.