CM Revanth Reddy's Convoy Car Tire got Punctured and Exploded : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు టైరు పంక్షర్ అయి పేలింది. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ టైరు పంక్షరై పేలింది.
20 రోజుల క్రితం గంటన్నర పాటు విమానంలో : గత నెలలోనూ రేవంత్ రెడ్డికి ఇలాంటి ఘటనే ఎదురైంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయి బయల్దేరారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో గంటన్నర పాటు ఆయన విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ముంబయికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ గత నెల 18న మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమాన సర్వీస్ రన్‌వే పైకి వెళ్తున్న క్రమంలో పైలట్ ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గమనించారు. వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. టేకాఫ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో కరెంటు కోత, తాగునీటి కొరత ఉండొద్దు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ప్రయాణికులను కిందకు దించకుండానే, ఇంజినీరింగ్ నిపుణులు గంటన్నర పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. అనంతరం 4 గంటలకు అదే విమానం ముంబయికి వెళ్లింది. మరమ్మతులు జరిగిన గంటన్నర పాటు సీఎం రేవంత్ రెడ్డి విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పైలట్ సాంకేతిక లోపాన్ని ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇప్పుడు తాజాగా ఆయన కాన్వాయ్‌లోని కారు టైరు పంక్షరై, పేలింది. ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రత్యేకం : సీఎం రేవంత్