CM Revanth Condolences to DS : మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు రేపు నిజామాబాద్‌కు వెళ్లనున్నారు. డీఎస్ మరణం పట్ల సీఎం రేవంత్ సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్, కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని కొనియాడారు.
సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన రేవంత్ రెడ్డి, డీఎస్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
పార్ఠీవ దేహంపై కాంగ్రెస్ జెండా.. పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకు తీరని లోటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. డీఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌లను పరామర్శించి, డీఎస్ చివరి కోరిక మేరకు ఆయనపై కాంగ్రెస్ జండా కప్పేందుకు అనుమతి తీసుకున్నారు. ఇద్దరు కుమారులు ఓకే అనడంతోపాటు ఆయన కాంగ్రెస్ మనిషేనని స్పష్టం చేయడంలో అప్పటికే సిద్దంగా ఉంచుకున్న కాంగ్రెస్ జండాను కప్పారు.
Funeral of DS with official ceremonies : మరోవైపు మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికార లాంఛనాలకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అంత్యక్రియల సమయం, స్థలంపై కుటుంబ సభ్యులతో చర్చించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్‌కు సీఎస్ తెలిపారు.
"పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకు తీరని లోటు. డీఎస్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలను అందించారు. ఆయన అత్మకు శాంతి చేకూరాలి. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము". - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం