CM Revanth Agreement with few Companies in US : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ బృందం బిజీబిజీగా గడుపుతోంది. పలు కంపెనీల ప్రతినిధిలతో భేటీ అవుతూ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సోమవారం కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న రేవంత్ బృందం తాజాగా మరికొన్ని సంస్థలతో అవగాహన కుదర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపింది. ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఆరు నెలల్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి, రెండేళ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్రైజిన్ టెక్నాలజీస్ యాజమాన్యం తెలిపింది. డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను ఈ కంపెనీ అందిస్తుంది. సుమారు 160 మిలియన్ డాలర్ల వార్షికాదాయం ఉన్న ట్రైజిన్ టెక్నాలజీస్‌లో ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలోని వంద మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఐటీ రంగంలో వృద్ధిని సాధించేందుకు : హైదరాబాద్‌లో డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆర్సీసీఎం కంపెనీ ఒప్పందం చేసుకుంది. న్యూయార్క్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఆర్సీసీఎం సీఈవో గౌరవ్ సూరి సమావేశమయ్యారు. అమెరికా వెలుపల తొలిసారిగా హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్సీసీఎం యాజమాన్యం ప్రకటించింది. రానున్న రెండేళ్లలో 500 మంది సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు తెలిపింది. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.
ఆర్సీసీఎం కంపెనీ ఏర్పాటుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని సీఎం అన్నారు. తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలతో బయో ఇథనాల్ తయారీ సంస్థ ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ్ బయో కంపెనీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్వచ్ఛ్ బయో కంపెనీ సీఈవో ప్రవీణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుమారు 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా రోజుకు 250 కిలో లీటర్ల సామర్థ్యంతో రెండో తరం బయో ఇంధన ప్లాంటు నెలకొల్పనున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.