CM Revanth Reddy Mahabubnagar Tour : పాలమూరు-రంగారెడ్డి తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టులు 18 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం ముందుగా అక్కడి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటారు. అలాగే కలెక్టరేట్ వద్ద మహిళ శక్తి క్యాంటిన్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేవలం మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.396.09 కోట్లతో ఈ పనులను ప్రారంభించారు.
పలు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం :
- పాలమూరు వర్సిటీలో ఎస్టీపీ, అకడమిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన
- ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
- మహబూబ్‌నగర్ రూరల్, గండీడ్‌లో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
- మహబూబ్‌నగర్‌లో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన
- మహబూబ్‌నగర్‌లో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన
- దేవరకద్రలో రూ.6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముగిసిన సీఎం రేవంత్ సమీక్ష : ప్రతి ప్రాజెక్టు వారిగా సూక్ష్మ స్థాయిలో స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. మండలం, గ్రామ వారీగా ఆయకట్టు వివరాలను రూపొందించాలను సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు స్టేటస్ రిపోర్టు ఉండాలని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల కింద కొత్త ప్రతిపాదనలను న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా రూపొందించాలని వివరించారు. ప్రస్తుతం చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ప్రతి ప్రాజెక్టుపై 30 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు. అన్ని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి నివేదికలివ్వాలని అధికారులకు చెప్పారు.
జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్లపై సమీక్ష : ఖానాయ్పల్లి ఆర్ అండ్ ఆర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఇందుకు అవసరమైతే గ్రామ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి పునరావాస కల్పనలో జాప్యం వద్దని సూచించారు. ఆర్డీఎస్కు సంబంధించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో చర్చించాల్సిన విషయాలు పరిష్కరించాల్సిన అంశాలను రూపొందించాలని వివరించారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికి ఏం కావాలో తయారు చేయాలన్నారు. ఆర్డీఎస్‌పై కొత్త ప్రతిపాదనకు ఏం అవసరం అవుతాయో ప్రతిపాదించాలని తెలిపారు.
ఎంపీ డీకే అరుణ హాజరు : అలాగే ఎలాంటి ఆర్ అండ్ ఆర్ సమస్య లేకుండా కోయల్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు సూచించారు. ప్రస్తుతం డిజైన్ చేసిన ఆయకట్టను పూర్తిస్థాయిలో అందించేందుకు స్పష్టమైన ప్రతిపాదన తయారు చేయాలని పేర్కొన్నారు. కోయల్ సాగర్ కింద హజిలాపూర్, చౌదర్పల్లి, నాగిరెడ్డి పల్లి లిఫ్ట్ ఇరిగేషన్లకు అవకాశాలను పరిశీలించాలన్నారు. నీటి లభ్యత ఆధారంగా వీటన్నింటిని పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబరు 2025 నాటికి కోయిల్ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇంజినీర్లు సీఎంకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. మహబూబ్‌నగర్ ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్