MSME New Policy Programme Launch in Hyderabad : ఐటీ, ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొవిడ్‌కు వ్యాక్సిన్ తయారీలో కూడా మన రాష్ట్రం ముందుందని వివరించారు. ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విధాన రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా పీవీ నరసింహారావు ఆర్థిక విధానాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
దేశం ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు పీవీ నరసింహారావు కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం అనేది పండగ : 'ప్రతీ ఏటా ఎంతో మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటికొస్తున్నారు. ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. స్కిల్ అప్‌గ్రెడేషన్ చేయడానికి కృషి చేస్తున్నాం. మహేంద్ర, టాటా కంపెనీలతో కూడా ప్రత్యేక సమావేశాలు చేసి పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాం. మేము చేసే ప్రతి ప్రయత్నమూ రాష్ట్ర భవిష్యత్తు కోసమే. వ్యవసాయం అనేది పండుగ, దండుగ కాదు అనేదే మా ప్రభుత్వ నినాదం. రూ.18 వేల కోట్ల నిధులు విడుదల చేసి రైతుల రుణాలు తీర్చాం.' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"విద్యార్థులు పొందుతున్న పట్టాలకు ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలకు సరిపోవడం లేదని ఈ గ్యాప్‌ను తొలగించేలా విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాం. ప్రముఖ కంపెనీలు స్కిల్ యూనివర్సిటీకి రూ.300 నుంచి రూ.500 కోట్లలను సామాజిక బాధ్యతగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ఎంఎస్ఎంఈలు కీలకం. 2028లో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుంది." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
మూసీ నది వీక్షణకు అభివృద్ధి : వ్యవసాయ రంగంలో కూడా యువత ఎదిగే విధంగా ప్రోత్సాహమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోందని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మూసీ నది వీక్షణకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి వచ్చేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడినట్లు అని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాలు వృద్ధి చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
SBI బంపర్ ఆఫర్ - ఇకపై MSMEలకు 45 నిమిషాల్లోనే లోన్! - SBI DIGITAL MSME LOAN IN 45 MINUTES