Bio Asia Conference at Hyderabad : తెలంగాణను రాబోయే పదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు. ఈ సదస్సుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధ ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీలు, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సీఎం రేవంత్‌తో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హాజరయ్యారు. ఈ సదస్సు ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జరగనుంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హెల్త్‌కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఆసియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందని తెలిపారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ముందు నుంచి పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ వివరించారు.
నిపుణుల కృషితోనే జీనోమ్ వ్యాలీ : నిపుణుల కృషితో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మారుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ సహా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. భారత్‌లోనే ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు. దేశంలోనే అత్యధిక ఈవీల విక్రయం హైదరాబాద్‌లోనే నమోదైందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆర్టీసీలోకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నామని చెప్పారు.
"ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా చేస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్‌లను రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తాం. రేడియల్ రోడ్లకు ఇరువైపులా క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేస్తాం. ఏపీలోని పోర్టుకు కలిపేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా కల్పిస్తాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
దిగ్గజ కంపెనీలకు విజ్ఞప్తి : బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ కేంద్రంగా హైదరాబాద్ మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆవిష్కరణలు, పరిశోదన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా హైదరాబాద్ మారాలన్నారు. అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు విస్తరించిందని చెప్పారు. ఆయా కంపెనీలు ఇక్కడి అనుకూలతలు, ప్రభుత్వ సహకారం అందుకోవాలని సూచించారు. తమతో భాగస్వాములు కావాలని దిగ్గజ కంపెనీలను కోరుతున్నామని చెప్పారు. సులభతర పారిశ్రామిక విధానంతో మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
అత్యధిక ఉద్యోగాల కల్పన : దేశ విదేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణలో నంబర్‌వన్‌గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉందన్నారు. దావోస్ వేదికగా రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని గుర్తు చేశారు. విభిన్న రంగాల్లో 50 వేల ఉద్యోగాలు రానున్నాయన్నారు. లైఫ్ సైన్సెస్‌లో గతేడాది రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 150 పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు వచ్చాయన్నారు.
'ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతిపెద్ద ఫార్మా కంపెనీలు మాతో ఎంవోయూలు చేసుకున్నాయి. జర్మన్ కంపెనీ మిల్టెని ఇక్కడ సెల్, జన్యు చికిత్స ప్రారంభించింది. మరో 4 ఎంఎన్‌సీలకు స్వాగతం పలుకుతున్నాం. పాతికేళ్లుగా ఫార్మా, ఐటీ, డిజిటల్, హెల్త్‌పవర్ హౌస్‌గా హైదరాబాద్‌కు పేరు. ఏఐ హెల్త్‌కేర్ సమ్మిట్‌ను గతేడాది విజయవంతంగా నిర్వహించాం. జినోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందిన పాట్రిక్‌సన్‌కు అభినందనలు' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ బయో ఆసియా సదస్సులో అంతర్జాతీయ ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్లు పాల్గొన్నారు. ఏఐ ఆధారంగా లైఫ్ సైన్సెస్, క్లినికల్ ట్రైల్స్‌లో మరింత సులువుగా పరిశోధనలు ఉత్పత్తులు తయారీపైన ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు, విధి విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, ఫార్మారంగ నిపుణుల ఉపన్యాసాలతో సదస్సు కొనసాగుతోందన్నారు.
ఫార్మా, లైఫ్‌సైన్స్ రంగ విస్తరణకు కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్ రెడ్డి
నేటి నుంచి 21వ బయో ఆసియా సదస్సు - జీవవైద్య సాంకేతిక రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై చర్చలు