CM Revanth Reddy Fires on BJP : అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్ మూల సిద్ధాంతమని, ఆ సిద్ధాంతాలను అమలు చేయడానికే బీజేపీని ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోరుట్ల కాంగ్రెస్ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీ కుట్రలను బయటపెట్టారు. కేంద్రం చేస్తున్న దాడులను మీరందరూ చూశారని, ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలపై నిర్ధిష్టమైన ఆరోపణ చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే బీజేపీ అజెండానని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగకుండా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించిందని తెలిపారు. రిజర్వేషన్ల రద్దుపై చర్చించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేఆర్ నారాయణన్ ప్రసంగించారని, రాష్ట్రపతి ప్రసంగం సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల రద్దు గురించి ఆధారాలతో సహా నేను వాదిస్తున్నాని అన్నారు. తన వాదనలపై సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మోదీ, అమిత్ షాకు ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ, దిల్లీ పోలీసులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టడానికి తాను కచ్చితంగా పోరాడుతానని హెచ్చరించారు.
'2000 సంవత్సరంలో వాజ్‌పేయి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మీ ముందు లొంగిపోతానని ఈ దిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగంపై సమీక్షించాలని వాజ్‌పేయి ప్రభుత్వం గెజిట్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చడానికి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను వేశారు. 2002లో వెంకటాచలయ్య కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలని వెంకటాచలయ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. 2002లో ఇచ్చింది నివేదిక అందుబాటులో లేదు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం బీజేపీకు లేకుండా పోయింది. 2015లో పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు తొలగించాలని గోల్వాల్కర్ సూచించారు. దళితులకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రం కావాలని ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్ చాలక్ గోల్వాల్కర్ రాశారు. గోల్వాల్కర్ చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్లు రద్దుకు యత్నిస్తున్నారని' సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు : బీజేపీ రిజర్వేషన్లు తొలగించాలనుకుంటే తాము పెంచాలనుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను సవరించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ రావాలని తెలిపారు. రిజర్వేషన్లను రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు గెలవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని ఆరెస్సెస్ మౌలిక సిద్ధాంతమన్నారు.
ఇప్పటికే కొన్ని ఆరెస్సెస్ మౌలిక సిద్ధాంతాలను మోదీ, అమిత్ షా అమలు చేశారని చెప్పారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని మండిపడ్డారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు ఆగమేఘాల మీద తనపై కేసు పెట్టారని దుయ్యబట్టారు. తనపై కేసు పెట్టేందుకు దిల్లీ పోలీసులను ఎంచుకున్నారు, ఎందుకంటే వారు కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటారు కదా అంటూ ఎద్దేవా చేశారు.
"గత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. రిజర్వేషన్లు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయా అని సుమిత్రా మహాజన్ అనుమానం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. 2002లో రాజ్యాంగాన్ని మారుస్తున్నామని గతంలో వాజ్‌పేయి చెప్పారు. 50 ఏళ్లు అయ్యిందనే రాజ్యాంగాన్ని మారుస్తున్నామని వాజ్‌పేయి చెప్పారు. ఈసారి బీజేపీకు ఓటు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడతాయి. రిజర్వేషన్లు పెంచాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలు పక్కకెళ్లాయి. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా అనే అంశంపై మాత్రమే జరుగుతున్నాయి. మోదీ, అమిత్ షా పోలీసులతో నన్ను బెదిరించాలని చూస్తే అది జరగదు. అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలి." - రేవంత్ రెడ్డి, సీఎం