CM Revanth Reddy About AI Services: అంతర్జాతీయ కృత్రిమ మేథ సదస్సుకు హైదరాబాద్ వేదికైంది. హెచ్ఐసీసీలో రెండ్రోజులపాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రతిఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేథ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపు 2వేల మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఏఐ సిటీ లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేథ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరైన సదస్సులో సమాజంపై ఏఐ ప్రభావం నియంత్రణ, సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్దిదశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఇందులో ప్రదర్శించనున్నారు.
"కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. అవి ఆశలతో పాటు భయాన్నీ తీసుకొస్తాయి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్‌కు రూపకల్పన జరుగుతుంది. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం. -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
IT Minister Sridhar Babu About AI Services : ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఏఐకి ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యమిస్తోందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే విధంగా కృత్రిమ మేథను వినియోగించుకుంటామన్న మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్ కు సమీపంలో 200 ఎకరాలలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాబోయే సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేరడమే లక్ష్యమన్న మంత్రి డీప్ ఫేక్ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యల గురించి రోడ్ మ్యాప్ విడుదల చేసిన సర్కారు పలు ఏఐ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేటితరం అద్భుత ఆవిష్కరణ అని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయన్న రేవంత్‌రెడ్డి విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామన్న సీఎం ఈ సందర్భంగా ఏఐ సిటీ లోగోను విడుదల చేశారు.
ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నాం. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం ఏఐ సాంకేతికతను అందిపుచుకుంటున్నాం. ప్రపంచస్థాయి వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. హైదరాబాద్ సమీపంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచస్థాయి ఏఐ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూస్తాం. సవాళ్లను ఎదుర్కొనేలా కృత్రిమ మేథను వినియోగిస్తాం. -శ్రీధర్ బాబు, ఐటీశాఖ మంత్రి