CM Revanth About Rangareddy Development : రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువలేదని, కానీ ఐటీ కంపెనీలు వచ్చాక భూముల విలువ అమాంతం పెరిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆనందించారు. ఎక్కడా లేనివిధంగా రూ.100 కోట్ల పలికిన భూమి రంగారెడ్డి జిల్లాలోనే ఉందని చెప్పారు. 360 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు వల్ల రంగారెడ్డి జిల్లా భూములు బంగారం అవుతాయని హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కాటమయ్య రక్ష కిట్ల పథకం పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి అభివృద్ధి గురించి కీలకవ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తొందరలో హయత్‌నగర్‌కు మెట్రో రాబోతుందని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తి అయ్యాయని చెప్పారు. సైబరాబాద్‌ను న్యూయార్క్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దుదామని తెలిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీ దేశంలో ఉన్న అన్ని సినిమాలకు ఉపయోగపడుతుందన్నారు. రాచకొండ ప్రాంతం ఒకప్పుడు కంటే అద్భుతంగా కనిపించిందన్నారు. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుస్తామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫాంహౌస్‌లో ఉన్నవాళ్లు ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికి మీరేం తెచ్చారని అడిగారు. వాళ్లు హైదరాబాద్‌కు గంజాయి, డ్రగ్స్ తెచ్చారని ఆరోపించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు అన్ని ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ కూలిపోతుందన్న వాళ్లు ఎక్కడున్నారు. వాళ్లు రోజులు లెక్కపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం ప్రకాశ్ గౌడ్ లాంటి వాళ్లు మాతో కలిసి వచ్చారన్నారు. పడగొడతామంటే నిలబెడతామని మాతో వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లు పక్కాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతుంది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నాం. రీజినల్ రింగ్ రోడ్డు వల్ల రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి. హయత్‌నగర్‌కు మెట్రో రాబోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలో ఉన్న అన్ని సినిమాలకు ఉపయోగపడుతుంది. రాచకొండ ప్రాంతం అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుస్తాం. ఇలాంటివి ఫాంహోస్‌లో ఉన్నవాళ్లకు ఏం తెలుస్తాయి." - రేవంత్ రెడ్డి, సీఎం
కుల వృత్తుల వారు తమ పిల్లలను బాగా చదివించండి : పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు. అందుకే కుల వృత్తులను బలోపేతం చేసుకుంటే బతకవచ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారికి పిల్లలను బాగా చదివించండని విజ్ఞప్తి చేశారు. కుల వృత్తికి అంకితం చేయకుండా పిల్లలను బాగా చదివించాలని సూచించారు. కులవృత్తిలో పెరిగే పిల్లలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలన్నారు.
గౌడన్నలకు శుభవార్త - కాటమయ్య రక్ష కిట్ల పథకం ప్రారంభం - cm Revanth Katamaiah Raksha Kits