CM Revanth Reddy Review : కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్కు నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్, జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, హైదరాబాద్ తరలింపునకు ఎంత ఖర్చవుతుందనే అంశాలపై పూర్తి అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
వచ్చే నెల 1 నుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. సమీక్షలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, జలమండలి ఎండీ, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ప్రశాంత్ జె.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.