CM Revanth Reddy Review on Grain Purchases : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగు నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వరికి మద్దతు ధరపై చర్చించారు. రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సమీక్షించిన ముఖ్యమంత్రి, ధాన్యం కొనుగోలులో అన్నదాతలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామన్న ఆయన, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్న సీఎం, ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఆరబెట్టి తెచ్చి, మంచి ధర పొందండి : వడ్లను నేరుగా కల్లాల నుంచి మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని సీఎం సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కనీస మద్దతు ధర అందేలా చూడాలి : కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వడగళ్ల వానలు వచ్చినా ఇబ్బందిలేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు వస్తుంటాయని, ఉద్దేశపూర్వక కథనాలు వస్తున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. అలాంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాగు నీటికి ఇబ్బందిలేకుండా చూడండి : మరోవైపు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే 2 నెలలు మరింత కీలకమని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, గతేడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నా, ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని గుర్తు చేశారు. భూగర్భ జల మట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటి పైనే ఆధారపడటంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.