CM Revanth Reddy Comments on Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదన్నారు. దిల్లీలో ‘ఆజ్‌తక్’ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై మాట్లాడారు.
దేశంలో సాధారణ పౌరుడి దగ్గరి నుంచి ప్రధాని వరకూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుందన్నారు. ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకే కాకుండా టికెట్ ధరలు పెంచుకోవడానికీ తామే అనుమతి ఇచ్చామన్నారు. అయితే బెనిఫిట్ షోకు అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చారని వ్యాఖ్యానించారు. హంగామా చేయకుండా వెళ్తే ఇంత గొడవయ్యేది కాదని.. కారు నుంచి బయటకొచ్చి చేతులూపుతూ ర్యాలీలా అభివాదం చేశారని, అప్పుడే అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు పోటెత్తగా, అది తొక్కిసలాటకు దారితీసిందని చెప్పారు. దాని ఫలితమే ఓ మహిళ మృతి, మరో చిన్నారి ఆసుపత్రిలో ఉన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
సినిమా స్టారా? పొలిటికల్ స్టారా? అనేది మా ప్రభుత్వం చూడదు, నేరం ఎవరు చేశారనే దాన్ని మాత్రమే చూస్తాం, ఘటనలో ఓ మహిళ చనిపోయింది.. దీనికి బాధ్యులు ఎవరు?, సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్ షో వేసుకుని చూడవచ్చు, ప్రేక్షకులతో కలిసి చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు చెప్పాలి - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
లా అండ్ ఆర్డర్ ప్రకారమే అంతా : అల్లు అర్జున్ తనను చిన్నప్పట్నుంచీ తెలుసని, కావాలని ఆయన్ను ఎందుకు అరెస్టు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత కాగా, ఆయన సొంతమామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారని, అల్లు అర్జున్ సతీమణి కుటుంబం తనకు బంధువులను ముఖ్యమంత్రి చెప్పారు. లా అండ్ ఆర్డర్ ప్రకారమే పోలీసులు నడుచుకుంటారని స్పష్టం చేశారు.
సినిమాలు చేయడం అల్లు అర్జున్ వ్యాపారం, డబ్బులు పెడతారు.. సంపాదిస్తారు.. మీకు, మాకు ఏమొస్తుంది?, వీరంతా దేశం కోసం ఏమైనా యుద్ధాలు చేశారా, సినిమాలు తీస్తున్నారు. డబ్బులు వస్తున్నాయి - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
తనకు తానే ఓ పెద్ద స్టార్‌ను అని రేవంత్‌రెడ్డి తెలిపారు. తనకంటూ అభిమానులు ఉండాలి కానీ, తానెవరికీ అభిమానిని కాదని ప్రకటించారు.