CM Revanth Phone Call to CBN : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్ తదితరులతో కలిసి సమీక్ష జరుగుతుండగా ఏపీలో టీడీపీ విజయం ప్రస్తావన రాగానే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు.
చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని చంద్రబాబు నాయుడును సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఆహ్వానిస్తే వెళ్తా.. ఏపీలో తెలుగుదేశం విజయంపై స్ఫందించిన సీఎం రేవంత్‌రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కూడా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం ప్రమాణస్వీకారానికి ఆహ్వనిస్తే తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీలో ఘనవిజయం సాధించిన మహా కూటమికి ఆయన అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రేవంత్‌రెడ్డి అన్నారు. విభజన చట్టం మేరకు మిగతా ఆస్తి, నీటి పంపకాల గురించి ఏపీతో చర్చించి పరిష్కరించుకుంటామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ పోటీ చేసిన ఎంపీ స్థానాలపై ప్రశ్నించగా పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని, ఓటమి ఒకరి ఖాతాలో గెలుపు తన ఖాతాలో వేసుకునే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.
ఇటీవలి ఫలితాలల్లో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లలో గెలుపొంది మొత్తంగా 175 స్థానాలకు గానూ 164 సీట్లతో కూటమి సునామీ సృష్టించింది. తెలుగుదేశం ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేన పోటీ చేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. పది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కూడా కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఇన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడం ఇదే తొలిసారి.
తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం - చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు రేవంత్ అభినందనలు