Telangana Fire department passing out parade in Hyderabad : తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే అత్యంత కీలకమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని వట్టినాగుపల్లిలో అగ్ని మాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో 483 మంది శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'ప్రజల ఆలోచనలు వినడం మా ప్రజా ప్రభుత్వ విధానం. 90 శాతంపైగా యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ విధానం. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతం వస్తోంది. ప్రభుత్వం పట్ల నిరుద్యోగులకు విశ్వాసం, నమ్మకం కలిగించాం. అందరి ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకం.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలనేదే ఈ ప్రభుత్వ విధానం. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగం, హెల్త్, ఇరిగేషన్ రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాం. రైతులకు పూర్తి సహకారం అందించాలనే లక్ష్యంతో బడ్జెట్లో అధిక కేటాయింపులు జరిగాయి. గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగులకు ప్రతినెల మొదటి తారీఖున జీతాలు రాలేదు. అందుకు వారు ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇస్తున్నాం. ఈ విధంగా ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం వచ్చే విధంగా చేశాం. ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం." - రేవంత్ రెడ్డి, సీఎం
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024