Lok Sabha Elections 2024 : కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లోనే ఆరులో ఐదు గ్యారెంటీలు అమలు చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని కేటీఆర్ అంటున్నారని, కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే హామీలు అమలు గురించి తెలుస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కారు రిపేర్‌కు వెళ్లిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, షెడ్డుకు వెళ్లిన కారును జుమ్మెరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందేనని దుయ్యబట్టారు.
పౌరుషానికి, పోరాటానికి మహబూబ్‌నగర్ నడిగడ్డ బిడ్డలు పెట్టింది పేరని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకునే వారు పాలమూరు వాసులని ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్, నల్గొండలో కాంగ్రెస్ జెండా ఎగురువేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేసేందుకు ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. డీకే ఆరుణ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
రైతుభరోసా నిధులు ఇంకా రైతుల ఖాతాలో జమకాలేదని కేసీఆర్ అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ సాక్షిగా మే 9 లోపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా హరీశ్ రావు రైతులకు రుణమాఫీ చేయలేదని అంటున్నారని, రాబోయే పంద్రాగస్టు లోపల రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలని కుట్ర చేస్తున్నారన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించామని, మే 13న జరిగే ఫైనల్స్‌లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈపార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్‌గా మారాయని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి తెలంగాణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
"కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఆరులో ఐదు గ్యారెంటీలు అమలు చేశాము. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని కేటీఆర్ అంటున్నారని, కేటీఆర్ చీరకట్టుకుని, ఆర్టీసీ బస్సు ఎక్కితే హామీలు అమలు గురించి తెలుస్తుంది. కారు రిపేర్‌కు వెళ్లిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. షెడ్డుకు వెళ్లిన కారును జుమ్మెరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే". - రేవంత్ రెడ్డి, సీఎం