CM Revanth on Panchayat Elections in Telangana : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఉన్న ఆటంకాలపై సీఎం ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
వారం రోజుల్లో సీఈసీ నుంచి ఎన్నికల జాబితా వస్తుందని అధికారులు వివరించారు. ఓటరు జాబితా వచ్చిన తర్వాత వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ నిర్దిష్ట గడువులోగా నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల ఉపాధికి చర్యలు తీసుకోండి : మరోవైపు చేనేత కార్మికుల ఉపాధిపై కూడా అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ, వైద్యారోగ్యం, తదితర శాఖలకు అవసరమైన క్లాత్‌ను ప్రభుత్వ సంస్థల నుంచే సేకరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపై ఆగస్టు 15 తర్వాత వివిధ శాఖలతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మహిళా శక్తి గ్రూపు సభ్యులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు.