CM Revanth Reddy Launched Sitarama Project : సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పూసుగూడెం పంప్ హౌస్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు ఫైలాన్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
'బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గత పదేళ్లులో ఏనాడు వారి నియోజకవర్గాలకు నీళ్లు కావాలని అడగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నీళ్లు కావాలని అడుగుతున్నారు. ఇది తమ ప్రభుత్వం విశ్వసనీయతకు నిదర్శనం. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు వారి మాటలతో అంచనాలు పెంచి నిధులు దోచుకున్నారు అందుకే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎలాంటి కోరికలు కోరలేదు. పదేళ్ల కాలంలో ఎక్కడ ప్రాజెక్టుల్లో అక్రమాలు బయటపడతాయని భయపడి సీడబ్ల్యూసీకి డీపీఆర్‌లను పంపించలేదు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా డీపీఆర్‌ను కూడా పంపించలేదు. ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులకు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయం కనిపించింది. రూ.18 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.7 వేల కోట్లను ఖర్చు చేశారు. కానీ ఒక్క గుంట భూమికి కూడా నీరు ఇవ్వలేదు.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రాజెక్టులు రీడిజైనింగ్ పేరుతో వేల కోట్లు దోచుకోవచ్చని చూశారు తప్పా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన ఏనాడు మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావుకు లేదని విమర్శించారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టును నాల్చారని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, అదేవిధంగా పాలమూరు జిల్లాలోనూ పరిస్థితులు ఇదే రకంగా ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టు పంపులను ఆన్ చేయలేదని అన్నారు. పదేళ్లులో ఈ ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత పదేళ్లులో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. హరీశ్ రావు తమ ప్రభుత్వ శ్రమను చులకనగా చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
మూడు పంప్ హౌస్‌లు ప్రారంభం : అంతకు ముందు సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. అలాగే భద్రాద్రిలోని మూడో పంప్ హౌస్‌ను ములకలపల్లి మండలం కమలాపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు 1.20 లక్షల ఎకరాలకు ఆయకట్ట ద్వారా సాగునీరు అందనుంది.