CM Revanth Reddy on Telangana Thalli Statue : సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సీఎం సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం సచివాలయం ఆవరణను ఆయన పరిశీలించారు. విగ్రహం ఏర్పాటు కోసం స్థలం, నమూనాపై అధికారులతో చర్చించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు.
మా చిత్తశుద్ధిని శంకించనవసరం లేదు : సోమాజీగూడ కూడలిలో ఉదయం నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదని, తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించనవసరం లేదని స్పష్టం చేశారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం, సామాజిక బహిష్కరణ చేస్తుందని బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ వేడుకలు సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విగ్రహానికి మార్పులు : ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తుది రూపంపై చర్చలు జరుగుతున్నాయని, అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని వివరించారు.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు: సీఎం రేవంత్‌రెడ్డి - Telangana Talli Celebrations 2024