CM REVANTH AIMS TRILLION DOLLAR ECONOMY : హైదరాబాద్ అభివృద్ది విషయంలో ప్రపంచంతోనే పోటీ పడుతాం తప్ప, పక్క రాష్ట్రాలతో కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే పదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేదే తమ సంకల్పమని వెల్లడించారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ది చేస్తామని సీఎం ప్రకటించారు.
ఐటీ అభివృద్దికి పునాది : హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాగ్నిజెంట్ విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్దికి పునాదిపడిందని సీఎం వివరించారు.
పెట్టుబడుల వెల్లువ : రాజకీయ వైషమ్యాలకు పోకుండా ఆ తర్వాత చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్దిని కొనసాగించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తాను తిరిగి వచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియాలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నానని, ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం వివరించారు.
రాబోయే 2 నెలల్లో మరిన్ని ఒప్పందాలు జరుగుతాయని, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ రెండో రింగ్ రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా సెమీ అర్బన్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఔట్ సైడ్ రీజినల్ రింగ్ రోడ్డు పరిధి గ్రామాలను ఆసియాలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, పారిశ్రామిక వేత్తలకు ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నట్లు సీఎం తెలిపారు.
"రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వాలు కొనసాగించిన నగర అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాము. మా పోటీ, పొరుగు రాష్ట్రాలైనా ఏపీ, కర్ణాటకతో కాదు. ప్రపంచంతోనే మేము పోటీ పడతాం". - రేవంత్‌రెడ్డి, సీఎం