CM Revanth Reddy Challenges BRS and BJP : త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం సాగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ విపక్ష పార్టీల వైఖరిపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు గట్టిగా తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. తూటాల్లాంటి మాటలతో ఎదురు దాడికి దిగుతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు యత్నిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేయనున్నట్లు చేవెళ్ల జనజాతర సభలో ప్రకటించారు.
"అధికారంలోకి వచ్చిన రెండు నెలల లోపు 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియంలోనే ఈ ఉద్యోగాలు ఇచ్చాం. నియామక పత్రాలు ఇస్తే ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వంటి వారు కుట్రలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నారు. పేదోళ్ల బిడ్డలకు తాము ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా?" - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదు : రఘునందన్ రావు
Congress Public Meeting in Chevella : 6గ్యారెంటీల్లో 200యూనిట్లవరకు ఉచితవిద్యుత్(Free Current Scheme), రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభం పురస్కరించుకొని చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహించింది. జనజాతర పేరుతో నిర్వహించిన ఆ సభలో బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక్క సీటైన గెలిచి చూపించాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తండ్రి పేరు చెప్పుకుని పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదంటూ వ్యంగస్త్రాలు సంధించారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు : మిగులు బడ్జెట్‌తో అప్పజెప్పిన రాష్ట్రాన్ని కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ సర్కారును విమర్శిస్తారని ప్రశ్నించారు. గుజరాత్ మోడల్(Gujarat Model) అంటే ఇళ్లను తగలపెట్టడం, రైతులను కాల్చి చంపడం, ప్రభుత్వాలు కూల్చడమేనా అని బీజేపీపై వ్యంగస్త్రాలు సంధించారు. బెదిరింపులకు బెదరకపోతే ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులను ఉపయోగించి భయపెట్టి పార్టీలో చేర్చుకుంటారంటూ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
"పదే పదే బీజేపీ వాళ్లు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఊళ్లో ఉన్నవాళ్లు అందరినీ తగలబెట్టడమా? ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు వెళితే వారిని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకుపోవడమా? సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు. మొన్నటి వరకు కేసీఆర్, మోదీ ఇద్దరూ కలిసే ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఇద్దరూ వేరువేరు అని నాటకాలు ఆడుతున్నారు." - రేవంత్ రెడ్డి, సీఎం
ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీల అమలు - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు : సీఎం రేవంత్