Tirupathi Reddy on Hydra Notices : అమర్ సొసైటీ దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందంటూ రెవెన్యూశాఖ జారీ చేసిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు తనను లక్ష్యంగా చేసుకుని అమర్ సొసైటీలోని నివాసితులను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వల్ల అమర్ సొసైటీలోని ప్రజలకు ఇబ్బందిగా ఉంటే, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి సహకరిస్తా : ఈ సందర్భంగా రెవెన్యూ నోటీసులపై మాట్లాడుతూ తాను 2017లో అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. తాను కొనుగోలు చేసిన ఇంటిని యజమాని అన్ని అనుమతులతోనే నిర్మించారని, ఈ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని తనకు చెప్పలేదన్నారు. ఇప్పుడు బఫర్ జోన్‌లో ఉందని నోటీసులు అందాయని తెలిపిన ఆయన, నిబంధనల ప్రకారం లేకుంటే తన ఇంటిని కూల్చివేయవచ్చని అన్నారు. అధికారులు సమయం ఇస్తే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోతానన్నారు. అలాగే ముఖ్యమంత్రి ప్రజల కోసమే మంచి పని చేస్తున్నారని, సీఎం చేసే మంచి పనులకు తన సహకారం ఉంటుందని వెల్లడించారు.
"అమర్ సొసైటీ దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందంటూ రెవెన్యూ శాఖ నోటీసులు అందాయి. నేను కొనుగోలు చేసిన ఇంటిని యజమాని అన్ని అనుమతులతోనే నిర్మించారు. ఈ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని నాకు చెప్పలేదు. నిబంధనల ప్రకారం లేకుంటే నా ఇంటిని కూల్చివేయవచ్చు. అధికారులు సమయం ఇస్తే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోతా. బీఆర్ఎస్ నాయకులు నన్ను లక్ష్యంగా చేసుకుని అమర్ సొసైటీలోని నివాసితులను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు". - తిరుపతిరెడ్డి, సీఎం సోదరుడు
మరిన్ని రెసిడెన్సీలకు నోటీసులు : మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు పలు కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. నెలలోగా ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.
'హైడ్రా' కూల్చివేతలు - హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ సమీక్ష