Kamma Global Federation Summit 2024 : రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని, అనర్గళంగా మాట్లాడటం ఆయన నుంచే నేర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కమ్మ ప్రపంచ మహాసభల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సభలను నిర్వహించనున్నారు. సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కమ్మ అంటే అమ్మ లాంటిదని, మట్టి నుంచి బంగారం తీయగల శక్తి కమ్మవారికి ఉందని పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా కమ్మ సామాజిక వర్గం తనను అభిమానిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్న చదువే, తనను ఉన్నతస్థాయికి తెచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాల వల్లే నేడు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీ రెండు సీట్లలో ఒక ఎంపీ సీటు గెలిచిందన్నారు. అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు కమ్మల కృషిని ఎవరూ కాదనలేరని స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి : అయితే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కమ్మ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కమ్మల కష్టానికి గుర్తింపు, అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. కమ్మ సంఘానికి ఇచ్చిన ఐదు ఎకరాల భూమికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమ్మ సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సమస్యలను పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
"నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి. నిరసనను అణచివేస్తామంటే దాని ఫలితం డిసెంబరు 3న చూశాం. దిల్లీలో తెలుగువారికి వెంకయ్యనాయుడు మంచి గుర్తింపు తెచ్చారు. దిల్లీలో నాయకత్వం లోపం కనిపిస్తోంది. కులానికి, ప్రాంతానికి అతీతంగా తెలుగువారి కోసం దిల్లీలో పని చేసే నాయకుడు రావాలి." అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మొదటిరోజు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు : ఈ సభకు తమిళనాడు నుంచి మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు, ఎంపీ కళానిధి, ఎంపీ వీరాస్వామి హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణం రాజు, ఎరపతినేని శ్రీనివాసరావు సహా కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి రోజు కార్యక్రమానికి తానా అధ్యక్షుడు దినకర్, పుల్లెల గోపీచంద్, ఎంఎస్కే ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, జీవితా రాజశేఖర్ దంపతులు, మురళీ మోహన్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.