Rs.5 Lakhs Ex Gratia To Flood Deceased Families : తెలంగాణలో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. శనివారం నుంచి ఆదివారం రాత్రి వరకు కురిసిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరద వల్ల రాష్ట్రంలో 15 మంది మరణించారు. ఈ నేపథ్యంలో వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
CM Revanth Review On Floods : రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని 30 వేల నుంచి 50 వేల రూపాయలకు పెంచాలని, అలాగే మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే 3 వేల సాయం 5 వేల రూపాయలకు పెంచాలని చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పంట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వర్ష ప్రభావిత జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం రూ.5కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
CM Revanth On Telangana Floods : తక్షణమే కేంద్ర సాయం కోరుతూ లేఖ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలని అధికారులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వెళ్లి భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యల పరిస్థితిపై ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలని చెప్పారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో 8 పోలీసు బెటాలియన్లను ఎన్డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు.