CM Revanth on Congress 100 days Governance : కాంగ్రెస్ ప్రజాపాలనకు రేపటికి వంద రోజులు పూర్తవుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో పదేళ్లలో 100 సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేశారన్న ఆయన, 100 రోజుల పాలనలో ఇందిరమ్మ రాజ్యంపై(Congress Govt) సంపూర్ణ సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. గత పదేళ్లలో ప్రభుత్వం పరిపాలనను బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపిందని సీఎం దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేదని, తాము మాత్రం ప్రజల్లోనే ఉన్నామని తెలిపారు.
అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశామని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు. బీఆర్ఎస్ టీఎస్‌పీఎస్సీని(TSPSC) అవినీతికి అడ్డాగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టామని వివరించారు.
కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి
"శాసనసభ సమావేశాల్లో కడియం శ్రీహరి, అంతర్గత చర్చల్లో కేసీఆర్ మా ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయం, పడగొడతామని బీఆర్ఎస్ వాళ్లు అన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు డా.లక్ష్మణ్ కూడా పార్లమెంట్ ఎన్నికల తరవాత ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8మంది ఎమ్మెల్యేలు. ఏ లెక్కలు కూడిన కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్లిద్దరు కలిసి మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తే తప్ప, వాళ్లు అనుకుంటున్న కార్యాచరణ జరగగదు. అలా చేస్తే మేమైనా చూస్తూ ఊరుకుంటామా?": -రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
ఉచిత విద్యుత్ హామీ అమలులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలు లక్ష్యంగా పనిచేశామని, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి ఆదాయాన్ని స్థిరీకరించామని సీఎం పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క తెలంగాణ ప్రాజెక్టు పూర్తి కాలేదని వివరించారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవని, నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చాయని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. మమ్మల్ని దెబ్బతీసేందుకు బీజేపీ-బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదని, ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదని రేవంత్ మండిపడ్డారు.
కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ - మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు