CM Revanth Issued Orders to DGP Regarding Law and Order : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ కుట్రలు సహించేది లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని విమర్శించారు. 'అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే యత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారు. మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి సమీక్ష చేయాలని డీజీపీని ఆదేశించాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవు. రాజకీయ కుట్రలు సహించేది లేదు' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
DGP On Latest Consequences In State : సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని తెలిపారు. ప్రజలెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
Congress Women Leaders To Meet Speaker : మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి మధ్య పంచాయితీ నడుస్తూనే ఉంది. దీనిపై కాంగ్రెస్ మహిళా నేతలు స్పీకర్‌ను కలవనున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.