TDP Leader Durga Rao Released in Jagan Stone Attack Case : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న టీడీపీ నేత వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ నాలుగు రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలుకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు.
అంతకుముందు శనివారం ఉదయం దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెరకాలనీ వాసులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. నాలుగు రోజులుగా దుర్గారావును ఎక్కడ దాచి ఉంచారని వారు ప్రశ్నించారు. కష్టపడి పనిచేసుకుని బతికే తమను రోడ్డు పైకి ఈడ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసుల్లో వడ్డెరలను ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు.
తన భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి అంటూ వేముల దుర్గారావు భార్య శాంతి, ఇతర మహిళలతో కలిసి భీష్మించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నిసార్లు వేడుకున్నా కనికరంలేదా? నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డుపై నిరసనలకు వీల్లేదంటూ పోలీసులు వారిని భయపెట్టేందుకు ప్రయత్నించారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళలను, సంఘ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఈ క్రమంలోనే వారిని బలవంతంగా ఆటోల్లో డీసీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారు టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరికి వినతిపత్రం అందించారు. కానీ చివరకు శనివారం రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చిమళ్లీ అవసరమైతే స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.
జగన్‌పై దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - Stone Attack on Jagan in AP
నీ వెనుక ఎవరున్నారని నిలదీశారు : విడుదలైన అనంతరం దుర్గారావు మాట్లాడుతూ "ఈనెల 16న సింగ్ నగర్ డాబాకొట్ల రోడ్డులోని టీకొట్టు వద్ద టీ తాగుతున్నా అంతలోనే పోలీసులు వచ్చి మాట్లాడాల్సిన పని ఉందంటూ వాహనం ఎక్కించారు. ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. నేను ఏ తప్పూ చేయలేదన్నాను. నీ వెనుక ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. అసలు నేను ఆ పని చేయనప్పుడు ఎవరుంటారని గట్టిగా జవాబిచ్చాను. సీసీఎస్‌లో నన్ను, సతీష్‌ను పక్కపక్క గదుల్లో ఉంచి విచారణ చేశారు. పోలీసులు నా వద్దకు వచ్చి జగన్‌పై రాయి వేస్తే రూ. వెయ్యి ఇస్తానన్నావట కదా అని అడిగారు. సతీష్ నాకు పరిచయం లేదని చెప్పాను. దీంతో ఇద్దరినీ కలిపి విచారించారు. నేను నిర్దోషినని పోలీసులకు అర్థమైంది. అందుకే నన్ను వదిలిపెట్టారని' దుర్గారావు వివరించారు.
మేజిస్ట్రేట్ ఎదుట సతీష్ వాంగ్మూలం రికార్డు! : మరోవైపు ఈ కేసులో నిందితుడు సతీష్‌ను తమ కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ సిద్ధం చేసినా పోలీసులు దానిని పక్కనపెట్టి మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం నమోదుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఘటనలో నిందితుడు రాయి విసిరిన సమయంలో చూసిన వారు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 164 కింద సతీష్‌ను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్లి అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది సోమవారం కావచ్చని తెలిసింది.
తుపాకీతో బెదిరించారట : నిందితుడు సతీష్ తండ్రి మాట్లాడుతూ "జైలులో సతీష్‌ను కలసి మాట్లాడాం. ఏం జరిగిందని అడిగితే పోలీసులు తనను చీకట్లోకి తీసుకెళ్లి నేరం ఒప్పుకోమని తుపాకీ చూపించి బెదిరించారని చెప్పాడు. అందుకే అలా చెప్పానని ఏడుస్తున్నాడు. తానేం చేయలేదు. తనకు ఏ సంబంధం లేదని అంటున్నాడని' తెలిపారు.
సీఎం జగన్ దాడి ఘటనలో సుస్పష్టంగా భద్రతా వైఫల్యం - లోపభూయిష్ఠంగా సిబ్బంది తీరు - AP ELECTIONS 2024
సీఎం జగన్‌కు దెబ్బతగిలితే ఏపీకీ గాయమైనట్లా? : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Speech at Tenali