CM Chandrababu Phone Call to Amit Shah : భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరద సహాయ చర్యలను వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవర్ బోట్లను రాష్ట్రానికి పంపాలని సీఎం కోరారు. అవసరమైన మేరకు సాయం చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామని చంద్రబాబుకు అమిత్ షా స్పష్టం చేశారు.
రాష్ట్రానికి 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు : అమిత్ షాతో మాట్లాడాక ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి పవర్ బోట్లను అత్యవసరంగా రాష్ట్రానికి పంపాలని కోరారు. అనంతరం కేంద్ర హెంశాఖ స్పందిస్తూ 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే పంపుతున్నామని తెలిపింది. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 25 మంది ఉంటారని వెల్లడించింది. రేపు ఉదయంలోగా పవర్ బోట్లు విజయవాడ చేరుకుంటాయని తెలిపింది. అలాగే మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నామని స్పష్టం చేసింది. రేపు వాయుమార్గంలో 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు పంపుతున్నామన్న కేంద్ర హోంశాఖ, సహాయ చర్యల కోసం 6 హెలికాప్టర్లను సైతం పంపుతున్నామని హామీ ఇచ్చింది.
2.76 లక్షల మంది వరద బాధితులు : విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2.76 లక్షల మంది వరద బాధితులు ఉన్నారని, వీరందరికీ ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగ్‌నగర్‌లో పరిస్థితిని పరిశీలించి బాధితులతో మాట్లాడానని తెలిపారు. వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం యుద్ద ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.
బాధితుల కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్లు : పులిచింతల ప్రాజెక్టు కింద నుంచి నీళ్లు వస్తున్నాయని, అలాగే మున్నేరు, బుడమేరు, ఇతర వాగుల సైతం నుంచి ఎక్కువ నీళ్లు వచ్చాయని తెలిపారు. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు భారీ వర్షాలు పడ్డాయన్నారు. వరద బాధితుల కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్లు 112, 107 ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారీవర్షాలు, వరదల గురించి కేంద్రానికి ఇప్పటికే చెప్పామని గుర్తుచేశారు. అవసరమైతే జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరతామని తెలిపారు. ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. వరద ప్రాంతాల గురించి ప్రతి గంటకు బులెటిన్ విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.