CM Chandrababu Naidu Review on One Family One Entrepreneur in AP : మహిళలు సొంత కాళ్ల మీద నిలబడేలా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు సిద్ధం అయ్యారు. ఎంఎస్ఎంఈ (MSME)లుగా స్వయం సహాయక గ్రూపు మహిళలకు ప్రోత్సాహం కల్పించి పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు సహకరించాలని 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' కార్యాచరణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలుగా స్వయం సహాయక సంఘాలు ఎదిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సెర్ప్, మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సీఎం సూచనలు చేశారు.
ఐదు కేటగిరీలుగా విభజన : 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సెర్ప్, మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందు కోసం అన్ని ఎస్‌హెచ్‌జీ (SHG)లను వాటి ఆదాయ ఆర్జన బట్టి ఐదు కేటగిరీలుగా విభజించాలని సూచించారు. ఏడాదికి రూ.లక్ష కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును 'నాన్ లాక్‌పతి'గా, రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు వరకు 'లాక్‌పతి', రూ.10 లక్షలు పైన సంపాదిస్తే 'మైక్రో', రూ.50 లక్షలు కన్నా అధికంగా ఆదాయం వస్తే 'స్మాల్', రూ.కోటి కన్నా ఎక్కువ ఆర్జిస్తే 'మీడియం' కేటగిరీలుగా విభజించాలని అన్నారు. అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలని తెలిపారు.
డ్రోన్ దీదీ పథకం : స్వయం సహాయక సంఘాలను ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే ప్రోత్సాహకాలతో ఆయా సంఘాలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కనీసం లక్ష ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు అయినా చేయాలని తెలిపారు. డ్రోన్ దీదీ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుని ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా స్వయం సహాయక బృంద సభ్యులకు శిక్షణ అందించాలని చెప్పారు. ఎస్‌హెచ్‌జీ సభ్యుల తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా చాలా తక్కువ ఉందని, దీనిపై దృష్టి పెట్టి వారి ఆదాయ మార్గాలు మెరుగు పరిచేలా ఆలోచన చేయాలని ఆదేశించారు.