CM Chandrababu Delhi Tour Updates : కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీకి వెళ్లారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు సీఎం వెంట ఉన్నారు. బుధవారం రాత్రి చంద్రబాబు టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో సమావేశయ్యారు. పార్లమెంట్ తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఏపీ సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించినట్లు తెలిసింది.
Chandrababu Meet PM Modi Today : గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రి, ఇతర కేంద్రమంత్రుల దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లనున్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.
ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్న సీఎం : ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయడం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు తెలిసింది.
ఉదయం 10:15 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. అంతకుముందే వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, 12:15 గంటలకు రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో, 2:45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, 10 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను, పన్నెండున్నరకు మంత్రి అఠవాలేలను చంద్రబాబు నాయుడు కలుస్తారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితోనూ సమావేశం కానున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తారు. శనివారం విభజన సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ - ఆయన సూచనకు సంపూర్ణ ఆమోదం - White Paper on Amaravati