CM Chandrababu Visit to Flood Affected Areas : ఏపీలోని విజయవాడలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పడవలో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా కూడా ఆయన పడవలో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింగ్‌నగర్ గండి పూడ్చడంపై ఆయన అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
అధికారులతో సీఎం సమీక్ష: బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశానని, వరదనీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తానని సీఎం అన్నారు. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తామన్నారు. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రులకు తరలిస్తామని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటానని బాధితులకు చంద్రబాబు భరోసా కల్పించారు. అనంతరం ఆయన విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పాలు, ఆహారం, నీరు, కొవ్వొత్తులు, టార్చిలైట్‌లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచీ తెప్పించాలని సూచించారు. లక్ష మందికి సరిపోయేలా ఆహారం సరఫరా చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నసీఎం తక్షణం అందుబాటులో ఉన్న ఆహార పొట్లాలను బాధితులకు అందించాలన్నారు. వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని సూచించారు. విజయవాడలో అన్ని షాపుల నుంచి వాటర్ బాటిళ్లను తెప్పించాలన్నారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని సీఎం తెలిపారు.
నిమిషాల లెక్కన బాధ్యతలు పూర్తి చేయాలి: ప్రతి ఒక్క బాధితుడికీ సాయం అందిద్దామని సాయంలో ప్రతి రెండు గంటలకు మార్పు కనిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్షయపాత్ర నుంచి, సరఫరా చేయగలిగిన ఇతర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని ఖర్చు గురించి ఆలోచన చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు, మంత్రులకు ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి పంపారు. నిముషాల లెక్కన అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నగరంలోని అన్ని దుకాణాల నుంచి వెంటనే బిస్కట్లు, పాలు తెప్పించాలని సీఎం నిర్దేశించారు.
కలెక్టరేట్‌లోనే చంద్రబాబు బస: విజయవాడ నగరం సాధారణ స్థితికి వచ్చే వరకూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌ను తాత్కాలిక సీఎం కార్యాలయంగా మార్చారు. కలెక్టరేట్ వద్దకు చంద్రబాబు ప్రత్యేక బస్సు వచ్చింది. అవసరమైతే బస్‌లోనే ఇవాళ సీఎం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతోపాటు హోం మంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ కూడా కలెక్టరేట్‌లోనే ఉండనున్నారు.