GIS Electricity to Amaravati : అమరావతి నిర్మాణ పనుల్లో ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాపై దృష్టి సారించింది. ఇందుకోసం 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)ని నిర్మించింది. ఇప్పుడు ఇది ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్రంలో మొదటిసారిగాఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలోని తాళ్లాయపాలెంలో ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. దీనిని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు.
ఇప్పటివరకు రాజధాని ప్రాంతానికి 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి కరెంట్ సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్ డిమాండ్‌కు అనుగుణంగా కరెంట్ సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220కేవీ విద్యుత్ కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించనున్న 220/33 కేవీ విద్యుత్ కేంద్రానికి సరఫరా చేస్తారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220కేవీగా అప్‌గ్రేడ్ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారు. వీటి ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు కరెంట్ సరఫరా అవుతుంది. తాడికొండ విద్యుత్ కేంద్రానికి ఇవి ప్రత్యామ్నాయం కానున్నాయి. అటు తాళ్లాయపాలెం, ఇటు తాడికొండ 220/33కేవీ విద్యుత్ కేంద్రాల నుంచి రాజధాని ప్రాంతానికి కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తారు.
తద్వారా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని కరెంట్ సరఫరాకు తోడ్పడుతుంది. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు సరఫరా చేయనున్నారు.
Amaravati Construction Works : మరోవైపు పాత టెండర్లు రద్దు చేసిన సీఆర్డీఏ కొత్త టెండర్లకు మార్గం సుగమం చేసింది. వైఎస్సార్సీపీ సర్కార్ మధ్యలో ఆపేసిన నిర్మాణాల్ని పూర్తి చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా త్వరలోనే ప్రజాప్రతినిధులు, అఖిలభారత సర్వీసు అధికారుల భవనాల పనులు పట్టాలెక్కనున్నాయి. దీనికోసం రూ. 524 కోట్ల రూపాయలతో సీఆర్డీఏ అంచనాలు సిద్ధం చేసింది. నూతనంగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వ అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం, 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు.
ఒక్కో అడ్డంకీ తొలగించుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం- కోటి ఆశలతో జనం
అమరావతి టవర్లకు మళ్లీ ఊపిరి - తొమ్మిది నెలల్లో మారనున్న రూపురేఖలు