CM Chandrababu Speech On Ramojirao : మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీ రావు అని సీఎం చంద్రబాబు అన్నారు. అంతే కాకుండా సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు.
అమరావతి కోసం రూ.10 కోట్ల విరాళం అందజేసిన ఈనాడు ఎండీ కిరణ్ - Ramoji Rao Memorial Meet
రామోజీ కృషికి అనేక అవార్డులు వచ్చాయి: రామోజీరావు వ్యక్తికాదు ఓ వ్యవస్థ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఏ పని చేసినా ఎప్పుడూ ప్రజాహితం కోరుకునే వారని అన్నారు. నీతి, నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు అని కొనియాడారు. ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్‌వన్‌గా ఎదిగారని తెలిపారు. 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రిక విశాఖలో ప్రారంభించారని ఐదు దశాబ్దాలుగా ఆ పత్రిక అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పని చేస్తోందని అన్నారు.
రామోజీరావు పత్రికారంగంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ప్రస్తావించారని ఎంతో మంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చిన గొప్ప వ్యక్తి రామోజీ అని చంద్రబాబు కొనియాడారు. మీడియా రంగంలో రామోజీ చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయని చంద్రబాబు నాయుడు తెలిపారు.
మార్గదర్శి సంస్థను దెబ్బతీయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఏం చేసినా ఆ సంస్థపై నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయారని తెలిపారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారని ఇంక రామోజీ ఫిల్మ్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా రామోజీని ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. చాలా మంది పదవులు ఉంటేనే సేవ చేస్తారు కానీ ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన, సేవలు అందించవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో అధికారంలోకి వచ్చారంటే అందులో రామోజీరావు పాత్ర కీలకమని గుర్తు చేశారు.
"రామోజీరావు నిరంతరం విలువల కోసం బ్రతికారు. ప్రజల కోసం పోరాటం చేశారు. నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తున్న సమయంలో రీసెర్చ్ చేసి అమరావతి పేరును సూచించారు. తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుందని అన్నారు. తెలుగు భాష, తెలుగు జాతి అంటే రామోజీకి ఎనలేని ఆప్యాయత ఉంది. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు మార్గ్ అని పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత". - చంద్రబాబు, ముఖ్యమంత్రి
అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్