Ram Mohan Naidu on SeaPlane : దేశంలో సీ ప్లేన్ తొలిసారిగా ఏపీ నుంచే ప్రారంభమవుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్‌పోర్టులు నిర్మించలేని మారుమూల ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలతో కనెక్టివిటి పెంచడానికి సీ ప్లేన్ సేవలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీంను రూపొందిస్తున్నామని చెప్పారు. మరో 3 నుంచి 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఏపీలో 4 రూట్లలో సీప్లేన్ ప్రయాణం ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతానికి విజయవాడ -శ్రీశైలంతో పాటు విజయవాడ - నాగార్జునసాగర్, విజయవాడ - హైద్రాబాద్ రూట్లను పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. శ్రీకాకుళం-నెల్లూరు తీరప్రాంతంలో అమరావతికి మరిన్ని స్టేషన్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధి సహా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ సేవలు సహకరిస్తాయని స్పష్టం చేశారు.
Sea Plane Services in AP : అమరావతి రాజధాని కేంద్రంగా విజయవాడ నుంచి సీ ప్లేన్ ఎగురుతుండటం హర్షణీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కొనియాడారు. ఇక్కడి ప్రజలకు ఇదో మధురానుభూతిగా పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో మరెన్నో కార్యక్రమాలు అమలు కానున్నాయని తెలిపారు. అమరావతి పర్యాటకానికి ఈ సీ ప్లేన్ ఓ మణిహారం కానుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 5నెలల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించామని కేశినేని శివనాథ్ వెల్లడించారు.
సీ ప్లేన్ సేవలు ప్రాంతీయ అనుబంధాలను మరింత పెంచుతాయని ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. సీ ప్లేన్ కార్యకలాపాల కోసం 8 ప్రాంతాలు ఇప్పటికే గుర్తించామని వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రహదారులు భవనాల శాఖకు తగిన ప్రోత్సాహం లభిస్తోందని చెప్పారు. ఆర్థిక వృద్ధి, పర్యాటకాభివృద్ధికి విమానాశ్రయాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా ఎయిర్ కనెక్టెవిటి పెంచుతున్నామని వివరించారు. కుప్పం, దగదర్తి, పుటపర్తిలో కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్లు బీసీ జనార్ధన్‌రెడ్డి వెల్లడించారు.
పర్యాటక రంగంలో మరో అద్భుతం - విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్
శ్రీశైలంలో ఏరోడ్రోమ్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు- సర్వే చేపట్టిన అధికారులు - Aerodrome in Srisailam