Johnny Master Released From Chanchalguda Jail : హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలయ్యారు. అక్కడి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో కారులో ఇంటికి వెళ్లారు. కాగా లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు పని చేసే దగ్గరకు వెళ్లి ఇబ్బందులు కలిగించవద్దని, జానీ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ బాధితురాలి వ్యక్తిగత జీవితంలో కల్పించుకోవద్దని హైకోర్టు షరతులు విధించింది.
అసలేం జరిగింది : గత సెప్టెంబరు 16న మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్‌పై కేసు నమోదయింది. మైనర్‌గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తరువాత బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఇరువురి వాదనల అనంతరం నిన్న హైకోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
జాతీయ పురస్కారం నిలిపివేత : ఇదిలా ఉండగా 2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. కాని పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ పేర్కొంది. ఈనెల 8న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారం పొందేందుకు జానీ మాస్టర్‌కు ఆహ్వానం అందింది. ఇందుకోసం ఆయనకు 4 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ కూడా లభించింది. అయితే పోక్సో కేసు నేపథ్యంలో ఆయన అవార్డును నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ వెల్లడించింది. దీంతో అప్పుడు జానీ మాస్టర్ తనకు ఇచ్చిన బెయిల్ వద్దనుకున్నారు. తరువాత పూర్తిస్థాయి బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
'ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు' : జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన బెయిల్
'ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుంటారు' : అనీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు