మాట నిలబెట్టుకున్న చంద్రబాబు- గుండె తరుక్కుపోయే ఆ ఘటన మీకు తెలుసా? - AP CM Chandrababu Help to Parveen - AP CM CHANDRABABU HELP TO PARVEEN
CBN Help to Parveen : ఎదుగుదల లేని బిడ్డను ఇచ్చి ఆ దేవుడు తమకు అన్యాయం చేశాడని కుమిలి పోతున్న ఆ తల్లిదండ్రులు వైఎస్సార్సీపీ పాలనలో మరో శాపాన్ని ఎదుర్కొన్నారు. అప్పటికే కొండంత కష్టంలో ఉన్న వాళ్లకి, విద్యుత్ బిల్లు ఎక్కువగా వాడుతున్నారంటూ పింఛన్ కట్ చేశారు పాలకులు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన భరోసాతో ఆ నిరుపేద కుటుంబంలో కష్టాలు తొలగిపోయి ఆనందం నెలకొంది.
Published : Jul 1, 2024, 8:58 PM IST
AP CM Chandrababu Naidu Helps to Parveen : బంగారం లాంటి బిడ్డ పుట్టిందని ఆ తల్లిదండ్రులు పడిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఏళ్లు గడుస్తున్నా బిడ్డలో ఎదుగుదల లేదు. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్లారు. కాళ్లా, వేళ్లా ప్రాథేయపడ్డారు. రోజుకు ఐదుసార్లు అల్లాను ప్రార్థించారు. కానీ, 20ఏళ్లుగా వారి కన్నీళ్లు తూడ్చిన నాథుడే లేడు. సరికదా, అప్పటి వరకు ఎంతో ఆసరా అయిన పింఛన్ కూడా తీసేశారు. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందనే సాకు చూపించి కట్ చేసేసింది దయలేని వైఎస్సార్సీపీ సర్కారు.
బంగారు తల్లి సీమా పర్వీన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను! #PensionsPandugaInAP #NTRBharosaPension #AndhraPradesh https://t.co/4AAHgJEZFO pic.twitter.com/dnFTViW9bj
— N Chandrababu Naidu (@ncbn) July 1, 2024
తల్లిదండ్రుల వయస్సు పైబడుతోంది. కానీ, ఏళ్లొచ్చినా ఎదుగుదల లేని ఆ పసికందు పర్వీన్ ఆలనా పాలనా చూసుకోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం ఆ కుటుంబానికి పెద్ద ఊరట నిచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పెద్ద భరోసా లభించింది. ఇంటికి పెద్ద కొడుకులా వారి కష్టాన్ని గమనించిన చంద్రబాబు, తక్షణమే పర్వీన్‌కు పింఛన్ జారీ చేస్తూ ఆదేశాలిచ్చారు.
NTR Bharosa Pension Scheme in AP : తమ అధినేత చెప్పడమే తరువాయి, మంత్రి కొల్లు రవీంద్ర పర్వీన్ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందించారు. కొండంత భరోసా దొరకడంపై పర్వీన్ తల్లిదండ్రులు ఆనందబాష్పాలు రాల్చారు. ఇన్నాళ్లకు ఊపిరి పీల్చుకుంటున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. బంగారు తల్లి సీమా పర్వీన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్‌కు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పింఛన్ తొలగించింది. నాటి మంత్రులు, అధికారులు చుట్టూ తిరిగినా, ఆమెకు న్యాయం జరగలేదు. 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం వచ్చిన చంద్రబాబును సీమా పర్వీన్ కుటుంబ సభ్యులు కలిశారు. కూటమి ప్రభుత్వం వస్తూనే పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నేతగా నాడు సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అంటూ బాధితురాలితో సెల్ఫీ దిగి, నాడు ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. పర్వీన్ వివరాలు చంద్రబాబు స్వయంగా నమోదు చేసుకున్నారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్‌కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చిందని నాడు ప్రభుత్వాన్ని నిలదీశారు. 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? అని నిలదీశారు.
ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే వైఎస్సార్సీపీ సంక్షేమ విధానమా? అని ప్రభుత్వ విధానాలను నాడు చంద్రబాబు ఖండించారు. కూటమి ప్రభుత్వం రాగానే సీమా పర్వీన్ పేరును అధికారులు పింఛన్‌దారుల అర్హుల జాబితాలో చేర్చారు. ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర సీమా పర్వీన్ ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందచేశారు. గత ఏడాది మచిలీపట్నం ఎన్నికల ప్రచారం ఘటనను, తాజా పింఛన్ అందచేత వివరాలను ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు.
సంపద సృష్టిస్తాం - పెంచిన ఆదాయం పంచుతాం : చంద్రబాబు - AP CM CBN on Wealth Creating