Chandrababu Meet TDP Leaders: తెలుగుదేశం అధినేత చంద్రబాబును తొలి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించిన మహాసేన రాజేష్, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు స్థానాలు మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలకు సర్దుబాటు చేయాల్సి వస్తుందనే ప్రచారం మూడు పార్టీల్లో నెలకొంది.
అనపర్తి స్థానం బీజేపీ అడుగుతోందని నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి వద్ద చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. 40 ఏళ్ల నుంచి తెలుగుదేశంతో నల్లమిల్లి కుటుంబానికి ఉన్న బంధం బీజేపీ నేతలకు చెప్పినట్లు చంద్రబాబు రామకృష్ణ రెడ్డితో అన్నట్లు తెలుస్తోంది. రామకృష్ణ రెడ్డి అనపర్తిలో చేస్తున్న పోరాటం తదితర అంశాలు బీజేపీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పినట్లు సమాచారం. అనపర్తిని బీజేపీకిస్తే ఆ ప్రభావం రాజమండ్రి ఎంపీపై పడుతుందని నల్లమిల్లి అన్నట్లు తెలుస్తోంది. ఇది స్థానిక అభిప్రాయంగా చంద్రబాబుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టీడీపీ వర్క్ షాప్ - TDP workshop with MLA MP candidates
వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉండవల్లిలో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. డోన్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పార్టీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి చంద్రబాబును కలిశారు. డోన్ నియోజవకర్గంలో సమిష్టి కృషితో పార్టీ గెలుపునకు పని చేస్తామని నేతలు హామీ ఇచ్చారు.
గత రెండున్నర సంవత్సరాలుగా ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సార్లు చంద్రబాబు నాయుడు డోన్ టికెట్ సుబ్బారెడ్డికే అని ప్రకటించారు. కానీ చివరి సమయంలో డోన్ అభ్యర్థిగా కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించడంతో, ధర్మవరం సుబ్బారెడ్డి గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ పిలిపించి కలిసి పని చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. వీరిద్దరి కలయికతో డోన్‌లో టీడీపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కడప ఎంపీ స్థానం మనదే- 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - TDP workshop
అలాగే ప్రొద్దుటూరుకు చెందిన సీఎం సురేష్, పిఠాపురంనకు చెందిన వర్మ, యలమంచిలికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు కూడా చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు పని చేస్తామని చంద్రబాబుకు నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరాలి: రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ నేత సురేష్ నాయుడు తన అనుచరులతో వెళ్లి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు విషయాలు చర్చించారు. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి గెలుపునకు నాయకులంతా కలిసి కృషి చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సురేష్ నాయుడు తెలిపారు.
మూడో జాబితాలో సీటు ఆశించి భంగపడిన ఆశావహులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేత ఆలపాటి రాజా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, పలువురు చంద్రబాబును కలిశారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటును అర్థం చేసుకోవాలని చంద్రబాబు నేతలను కోరుతున్నారు. అధినేత మాటే శిరోధార్యమని, చంద్రబాబుపై తమకు ఎంతో నమ్మకం ఉందని సమావేశం అనంతరం నేతలు అంటున్నారు.
పి.గన్నవరం అసెంబ్లీ స్థానంలో జనసేన: మరోవైపు అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తొలుత పి.గన్నవరం సీటును టీడీపీ కేటాయించి, మహాసేన రాజేశ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ మేరకు నియామక పత్రాలను అందజేశారు. మరికొద్ది రోజుల్లో గిడ్డి సత్యనారాయణను పి.గన్నవరం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే ఎన్నికల్లో పి.గన్నవరం అసెంబ్లీ స్థానంలో జనసేన తప్పనిసరిగా విజయం సాధిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.
13 ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - TDP Candidates Third List