TDP Pedana Public Meeting: శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు, ఏపీ ప్రజలు జగనాసురవధ చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను నట్టేట్లో ముంచేసిన వ్యక్తి సైకో జగన్ అని ధ్వజమెత్తారు. జగన్ కొత్త పేరు 'జె గన్ సైకో' అని ఎద్దేవా చేశారు. బాబాయ్‌ని హత్య చేసి, కోడికత్తి డ్రామా ఆడిన జగన్ ఇప్పుడు మళ్లీ గులకరాయి డ్రామా ఆడుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.
సభకు వస్తే ఇస్తానన్న డబ్బులివ్వలేదని ప్రజలు చెప్తున్నారని దుయ్యబట్టారు. తమ మీద వేసిన రాళ్లు దొరికాయి. కానీ, జగన్ మీద వేసిన గులక రాళ్లు దొరకలేదని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కడం తప్ప జగన్‌కేం తెలియదని, బటన్ నొక్కడానికి జగన్ కావాలా?, ఇంట్లో ఉన్న ముసలమ్మ కూడా నొక్కుతుందని ఎద్దేవా చేశారు. సంపద సృష్టికి తెలివి కావాలని చెప్పారు. తమవి మూడు జెండాలు కానీ.. ఏజెండా ఒక్కటే అని స్పష్టం చేశారు. తాము ముగ్గురం కలిసి వస్తుంటే, జగన్ శవాలతో వస్తున్నాడని ధ్వజమెత్తారు. కొనకళ్ల నారాయణ, వేదవ్యాస్ వంటి వారికి అవకాశం కల్పించ లేకపోయామని, అధికారంలోకి రాగానే వీరిద్దరిని గౌరవిస్తామని హామీ ఇచ్చారు. విధ్వంసం, అహంకారంతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని మండిపడ్డారు. బందరు పోర్టు, అమరావతి వస్తే పెడన ఇంకా అభివృద్ధి అవుతుందన్నారు.
' లిక్కర్, ఇసుక, భూకబ్జాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనాలని జగన్ చూస్తున్నారు. జగన్ వేధింపులు తట్టుకోలేక అనేక మంది వైకాపా నాయకులు బయటకు వచ్చారు. ఐదేళ్లలో ఎంపీగా ఉన్నా.. ఏమీ చేయలేకపోయాననే బాధతో బాలశౌరి బయటికొచ్చి జనసేనలో చేరారు. ప్రజలను గెలిపించేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా కూటమి అజెండా. మా వద్ద డబ్బులేదు.. కానీ, నిజాయితీ ఉంది. పొత్తు బాధ్యత కింద కొనకళ్ల నారాయణ, బూరగడ్డ వేదవ్యాస్ సీట్లు త్యాగం చేశారు. వారికి అండగా ఉంటాం. ప్రజాజీవితంలోనూ హీరోగా నిరూపించుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్.'- చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత
వైసీపీవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు మూడు పంటలకు నీళ్లు వచ్చేవని అన్నారు. పోలవరం పూర్తి చేయలేదు, పట్టిసీమను పట్టించు కోలేదని ఆరోపించారు. బందరు పోర్టు, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయి పెడనకు పరిశ్రమలు వస్తే మీ పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. ఇదే తన కల, ఆలోచన అని తెలిపారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, అభివృద్ధి సాధ్యమవుతుందంటూ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మచిలీపట్నం- విజయవాడ హైవే నిర్మించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.
వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు పెరిగాయి: చంద్రబాబు - Sri Rama Navami