Blood Sugar Control Green Coffee : ప్రతి రోజు ఒక కప్పు కాఫీ తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని నిపుణులు చెబుతారు. కాఫీ తాగడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉండటమే కాకుండా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్‌ను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడటం, కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్తనాళాలు పని తీరు మెరుగుపడుతుందని తెలుపుతున్నాయి. ఇలా చాలానే ఉపయోగాలు బ్లాక్, నార్మల్ కాఫీలతో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా గ్రీన్ కాఫీ మార్కెట్లోకి వచ్చింది. దీని వల్ల మధుమేహం తగ్గడమే కాదు శరీర బరువు సైతం తగ్గుతుందట. మరి ఇంతకీ ఈ కాఫీని ఎవరు తయారు చేశారో తెలుసా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి. ఆరోగ్యానికి గ్రీన్ కాఫీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
ఓ ఫార్ములాతో హైదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ రసాయన శాస్త్ర ఆచార్యులు జయసూర్యకుమారి, శ్రీవల్లి, ఎం. స్రవంతిలు ఈ గ్రీన్ కాఫీని రూపొందించారు. గ్రీన్ కాఫీ తాగుతూ ఆస్వాదించడానికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని వారి పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహం సమస్య ఉంటే నియంత్రణలో ఉంచుతుందని శరీర బరువును తగ్గిస్తుందని ప్రొఫెసర్ జయసూర్య కుమారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను వారి కుటుంబ సభ్యులపైనే చేసినట్లు వెల్లడించారు. ఆ ప్రయోగాలు మంచ ఫలితాలు ఇవ్వడంతో గ్రీన్ కాఫీకి సంబంధించిన ఫార్ములా విషయమై పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రోజుకొకసారి తాగితే చాలు :
ఈ గ్రీన్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం వల్ల రోజుకు ఒకసారి తాగినా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
కొవ్వును కరిగిస్తుంది.
జీవక్రియను పెంచడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
ఈ ప్రయోగాల్లో 90 శాతం మందికి శరీర బరువు తగ్గినట్లు తేలింది.
టైప్-2 మధుమేహం తీవ్రత తగ్గినట్లు పరిశోధనల్లో స్పష్టంగా కనిపించింది.
గ్రీన్ కాఫీ విషయంలో మార్కెట్ చేసేందుకు వాణిజ్య సంస్థలు ముందుకొస్తే తయారీ విధానాన్ని వివరించి, విక్రయిస్తామని ప్రొఫెసర్ జయసూర్యకుమారి తెలిపారు. గ్రీన్ కాఫీ గింజలను కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని సంప్రదాయ కాఫీ తోటల నుంచి సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
గ్రీన్ కాఫీని ఎలా తాగాలి : గ్రీన్ కాఫీ అంటే.. ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతోంది. మరిగించిన వేడినీళ్లలో దీన్ని వేసుకుని తాగవచ్చు. అలాగే ఐస్ కాఫీ తరహాలో ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని ఐస్ కాఫీని తాగవచ్చు. ఒక ప్రత్యేక ఫార్ములాతో ఐస్ కాఫీ తరహాలో గ్రీన్ కాఫీని తయారు చేసినట్లు జయసూర్యకుమారి తెలిపారు. కాఫీ గింజలను నిర్ణీత ఉష్ణోగ్రతలో శీతలీకరణ చేసి ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ప్యాక్‌లలోని శీతల పానీయం తరహాలో ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు వారు రూపొందించిన పద్ధతిలో గ్రీన్ కాఫీని ఎవరూ తయారు చేయలేదని వెల్లడించారు.
వీళ్లు సాయంత్రం పూట కాఫీ తాగొద్దట! - కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా..? - Coffee Effects on Health