CEO Vikas Raj on Parliament Elections : లోక్‌సభ, కంటోన్మెంట్ ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలుపై గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సరిహద్దుల వద్ద 24 గంటలు పని చేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సరైన పత్రాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటామని వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి-విజిల్ యాప్ లేదా 1950 ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సీఈవో వెల్లడించారు.
రాజకీయ పార్టీలు రోడ్ షోలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఈవో వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. రోడ్ షోలు సెలవు రోజుల్లో నిర్వహించాలని సూచించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయరాదని హెచ్చరించారు. సుమారు లక్షన్నర మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని, 71 వేల 968 ఈవీఎంలను వినియోగించనున్నట్లు తెలిపారు. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన సుమారు 5 వేల కేంద్రాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
ఈసీ కీలక నిర్ణయం- బంగాల్ డీజీపీ సహా ఆరు రాష్ట్రాల అధికారుల తొలగింపు
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓటర్ల వివరాలనూ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 85 ఏళ్లు దాటిన వృద్ధులు 1.94 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నట్లు వివరించారు. ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఫారం డీ పంపిణీ చేయాలని చెప్పామని, ఇందుకోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత 3, 4 రోజుల్లో హోమ్ ఓటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే
ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ఈసారి 48 వేల వీవీ ప్యాట్లు అవసరమని వికాస్‌రాజ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 500 ఈవీయంలు, 500 వీవీ ప్యాట్లు అవసరమవుతాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 1.8 లక్షల మంది సిబ్బంది అవసరమని, అదనంగా మరో 25 వేల మంది సిబ్బంది కూడా అవసరమవుతారని వివరించారు. 40 వేల మంది బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు పని చేస్తారని వెల్లడించారు. పోలింగ్ విధుల్లో 145 కేంద్ర బలగాలు, 60 వేల మంది పోలీసు సిబ్బంది, 1920 ఎన్‌ఫోర్స్‌మెంజ్ ఏజెన్సీలు ఉంటాయని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో 17 ఎంపీ, 1 ఎమ్మెల్యే స్థానానికి మోగిన ఎన్నికల నగారా - పోలింగ్ ఎప్పుడంటే?