Central Team Visits Flood Affected Areas In Khammam : భారీవర్షాలు, వరదలతో నష్టపోయిన ఖమ్మం జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాల పర్యటన ముగిసింది. రెండోరోజూ రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండుబృందాలుగా జిల్లాలో పర్యటించింది.
తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు : మొదటి బృందం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప, ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు, బొక్కలగడ్డ ప్రకాశ్‌నగర్, మున్నేరు బ్రిడ్జి, మోతీనగర్‌లో పర్యటించింది. మున్నేరు వరద ఉద్ధృతితో కకావికలమైన బాధిత కాలనీల వాసులు కేంద్ర బృందం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. పలు కాలనీల్లో వరద మిగిల్చిన కష్టాలను అధికారులకు వివరిస్తూ కొంతమంది మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. సర్వం కోల్పోయాయమని తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకున్నారు.
నష్టాన్ని అంచనా వేసిన కేంద్రబృందం : ఖమ్మం గ్రామీణం మండలం దానవాయిగూడెం తల్లంపాడు- తెల్దారుపల్లి,తనగంపాడు, ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని రెండో బృందం పరిశీలించింది. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ మున్నేరు వరద ఉద్ధృతి, ప్రవాహం ఏ మేరకు వచ్చింది ఇళ్లల్లోకి ఎక్కడి వరకు వరద నిలిచిందన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర బృందానికి నష్టాన్ని వివరించిన కలెక్టర్ : భారీవర్షాలు,వరదలతో ఖమ్మం జిల్లాకు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ ముజ్‌మిల్ కేంద్ర బృందానికి వివరించారు. ఖమ్మంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శన ద్వారా జిల్లాకు జరిగిన నష్టాలపై వివరించారు. దెబ్బతిన్న ఇళ్లు, బాధితులకు జరిగిన నష్టం, ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాలను వివరించారు. భారీ వర్షాలు, వరదల దాటికి రూ.730 కోట్లమేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర బృందానికి అందించి ఆదుకోవాలని కోరారు.
భారీ వర్షాలు, వరదల విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని ఫొటో ప్రదర్శనలు వరద విలయం తమ కళ్లకు కట్టినట్లు అర్థమవుతుందని కేంద్ర బృందానికి నేతృత్వం వహించిన కల్నల్ కేపీ సింగ్ అభిప్రాయపడ్డారు. జిల్లాకు, రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.
ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన - ముఖ్యమంత్రిని అడ్డుకున్న వరద బాధితులు - KHAMMAM FLOOD VICTIMS BLOCKS CM