Central Minister Kishan Reddy Letter To CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కి వెళ్లే రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం రేవంత్‌ని కోరారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్‌మోడ్‌లో పూర్తవుతోందన్నారు. దీనికి ప్రభుత్వ సహకారం అవసమని తెలిపారు.
స్టేషన్ల అభివృద్ధి పనులు : కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్‌తో పాటుగా ఎలక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిలో రూ. 415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణం వేగవంతంగా పూర్తవుతోందని వివరించారు.
రహదారి వల్ల ట్రాఫిక్ సమస్య : హైదరాబాద్‌కు ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి రైల్వే టర్మినల్ కీలకం కానుందని స్పష్టం చేశారు. దక్షిణమధ్య రైల్వే కేంద్రస్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్న తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈ రైల్వే స్టేషన్‌ను అంకితం చేసేందుకే ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
రైల్వేల అభివృద్ధి : రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచ్చి, పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయని గుర్తు చేశారు. రేతిఫైల్ బస్‌స్టేషన్, ఆల్ఫా హోటల్ మధ్య ఇరుకుగా ఉన్న రహదారి వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్నారు. రైల్వేస్టేషన్ పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేనాటికి రోడ్డు విస్తరణ పూర్తయి ట్రాఫిక్ సమస్యలు తగ్గేందుకు వీలువుతుందన్నారు. దీనిపై చొరవ తీసుకోవాలని లేఖలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. మీరు తీసుకునే ఈ చొరవ తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు ఎంతో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.