Central Minister Kishan Reddy Fires on Congress : ఎన్ని రోజులు బీజేపీ, ఎన్డీఏ అధికారంలో ఉంటుందో అప్పటివరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్థాన్, ఐఎస్ఐ ఉగ్రవాదాలు ఉద్ధృతమవుతాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అవినీతి పెరుగుతుందని, కుటుంబ పాలన పెరుగుతుందని, లైసెన్స్ రాజ్, పైరవీరాజ్ వస్తుందని ధ్వజమెత్తారు. సోమాజిగూడలోని ఓ గార్డెన్లో నిర్వహించిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టామని తెలిపారు. పాకిస్థాన్‌ను ప్రపంచంలో ఏకాకీని చేశామన్నారు. పాకిస్థాన్ నేడు చిప్పపట్టుకుని భిక్షమెత్తుకునే పరిస్థితి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేసుకుంటే కూడా రెండు దేశాలతో స్నేహం చేస్తున్న ఏకైక దేశం భారతదేశమని గర్వంగా చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అనేక హామీలు ఇచ్చి గ్యారంటీల పేరుతో గారడీలు చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 8 నెలలు పూర్తి అవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానంతో ఎలా వ్యవహరిస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు.
ఆరు గ్యారంటీలు ఎక్కడికి పోయాయి : వందరోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామని సోనియాగాంధీ సంతకంతో కూడిన లెటర్ ఇంటింటికీ పంపిణీ చేశారని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు ఎక్కడికి పోయాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ అరకొర మాత్రమే చేశారన్నారు. అప్పుల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో పనిచేస్తోందన్నారు. ఇప్పుడు చేసిన అప్పు మీద వడ్డీ ఎవరు కడతారు. తెలంగాణ, కర్ణాటక భవిష్యత్తు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటని వీటన్నింటికీ జవాబులు లేవని మండిపడ్డారు.
ఏ పని చేయడానికైనా ప్రభుత్వం వద్ద నిధులు లేవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో త్రిపుల్ ఆర్ ట్యాక్స్‌ను పోటీపడి వసూలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డ పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
"మూడోసారి పగ్గాలు చేపట్టడం అద్భుతం. అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ. ఎన్నికలు పూర్తికాగానే రాజ్యాంగం గురించి మాట్లాడటం కాంగ్రెస్ మర్చిపోయింది. పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేయడమే కాంగ్రెస్ వ్యూహం. మోదీ మూడోసారి ప్రధాని గద్దెనెక్కకుండా దేశ వ్యతిరేక శక్తులు శక్తివంచన లేకుండా పని చేశాయి." - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి