Snake Bite Cases in Telanagana : పాముకాటు బాధితులకు నాణ్యమైన చికిత్స అందించి మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పాముకాటు మరణాలు, వైకల్యాల తగ్గింపునకు వ్యూహాత్మక విధానం 2030 పేరుతో తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలను వివరించింది. ప్రైవేట్, ప్రభుత్వాసుపత్రుల్లో నమోదయ్యే పాము కాటు కేసుల వివరాలను వెంట వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), పట్టణ, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించింది.
జాగ్రత్తలతో మేలు
- పాముకాటుపై చిన్నారులకు అవగాహన ఉండేలా చూడాలి. గోడలకు రంధ్రాలు ఉన్న చోట పిల్లలను ఆడకుండా చూడాలి. చీకట్లో వెళుతున్నప్పుడు, చెట్లపొదలలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించాలి.
- అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి పాముకాటు ముప్పు అధికంగా ఉంటుంది. నిర్మాణ సామగ్రి, కట్టెల మధ్య, ఇళ్లలో బియ్యంబస్తాలు, పాములు ఆవాసాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇళ్లలో మట్టి నేలపై పడుకునే వారు పాముకాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది.
- చెప్పులు, బూట్లు ధరించే సమయంలో వాటిని బాగా దులిపిన అనంతరమే వేసుకోవాలి.
- రైతులు పొదలు, గడ్డి, బురద ప్రాంతాల్లో నడుస్తున్నప్పడు బూట్లు ధరించడం మేలుగా, రక్షణగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాల్లో రాత్రిపూట కాపలాకు వెళుతున్నప్పుడు టార్చిలైట్ వెలుతురులో ఏదైనా చప్పుడు చేస్తూ వెళ్లాలి.
చేపట్టనున్న చర్యలు : పాముకాటు బాధితుల మరణాలను నివారించేందుకు చేపట్టనున్న చర్యలను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా తెలిపింది. మొదటగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన పెంపొందిస్తారు. చికిత్స, వసతుల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సెలైన్స్, యాంటీ వినమ్, ఆక్సిజన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. పాముకాటు బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించేందుకు రవాణా సౌకర్యాన్ని అభివృద్ధి చేస్తారు.
ప్రజలకు ఈ పాము కాటుపై అవగాహన పెంపొందించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ఆరోగ్య అధికారులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఏటా పాముకాటు కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. పరిస్థితి విషమించాక బాధితులు ఆసుపత్రికి చేరుకోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హస్పిటల్స్లో మెరుగైన వైద్య సదుపాయాలు లేక పాముకాటు బాధితులు పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా చికిత్స సమయం దాటిపోతుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించడం కత్తి మీద సాములా మారింది.
పాముకాటు మరణాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. పాముకాటుపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. పాము కాటుకు గురైనప్పుడు బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు.
-డాక్టర్ శ్రీనివాస్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి