Problematic to Contact Dial 100 : అత్యవసర సమయంలో పోలీసుల సేవలు పొందేందుకు ఎంతో కాలంగా ప్రాచుర్యం పొందిన డయల్ 100 ఒక్కోసారి పని చేయక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ‘సమాచారమివ్వండి క్షణాల్లో మీముందు ఉంటాం’ అంటూ ఇది వరకు పోలీసులు చేసిన ప్రచారంతో 100 నంబరు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. దీంతో ఈ నంబర్‌కు ఫోన్ చేయడం ప్రజలకు అలవాటైంది. దీనివల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి డయల్ 100కి చేసిన వెంటనే సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బందిని వీరు అప్రమత్తం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఫోన్‌లు ఎక్కువగా వచ్చే సమయంలో ఈ నంబరు పనిచేయడం లేదని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనివల్ల అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Dial 112: అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్
కేంద్ర ప్రభుత్వ చొరవతో : దేశవ్యాప్తంగా అత్యవసర నంబరు 112ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ఫోన్ చేస్తే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇస్తున్నారు. ఈ నంబరు ప్రాముఖ్యం పొందేలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తోంది. దానికి డయల్ చేస్తే వెంటనే పోలీస్ సేవలు పొందేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డయల్ 100 ఫోన్ కనెక్షన్ల సంఖ్య తగ్గించి 112కు పెంచే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయ నంబర్‌కు ఫోన్ చేసి తక్షణసేవలు పొందాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
తక్షణ సేవలకు సిద్ధం : పోలీస్ పరంగా తక్షణ సేవలు పొందేందుకు ప్రయత్నిస్తే డయల్ 100 ఒక్కోసారి పనిచేయడం లేదని తమ దృష్టికొచ్చిందని, దీన్ని మంగళగిరిలోని ప్రధాన కార్యాలయ అధికారులకు తెలియజేశామని ఎస్పీ దీపిక తెలిపారు. ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడం వల్ల ఆ సమయంలో ఈ సమస్య వస్తున్నట్లు తేలిందన్నారు. అలాంటి సమయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112కు ఫోన్ చేయొచ్చని తెలిపారు. మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో సిబ్బంది ఫోన్ సమాచారం స్వీకరించి ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేసి పోలీస్ సేవలు అందించేలా చూస్తామన్నారు.