Cantonment Board Civil areas to be Merged with GHMC: సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ఇక కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు: కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దిల్లీకి వెళ్లిన ప్రతిసారి రక్షణ శాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రద్దు చేసిన వాటిని మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని, తాజాగా నిర్ణయానికి వచ్చింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఇటీవలే కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్ ప్రమాణ స్వీకారం - MLA Shri Ganesh Oath Ceremony
కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ: ఈ నెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర రక్షణ శాఖ అందుకు సంబంధించిన విధి విధానాలపై లేఖ రాశారు. దీని ప్రకారం కంటోన్మెంట్ లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేయనున్నారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ కానున్నాయి. ఇప్పటికే లీజుకు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి.
కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా : మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించనుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధించనుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కనున్నాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు, సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది.