CBI Investigation on Kaleshwaram Project Case in High Court Update : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలన్న అంశంపై ప్రభుత్వ వైఖరి తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ వైఖరేంటో తెలుసుకొని చెప్పాలని అదనపు ఏజీకి ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కేఏ పాల్, కోదండరాం, బక్కా జడ్సన్, నిరంజన్ తదితరులు గతంలో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినందున సీబీఐ(CBI) విచారణ ఇంకా కోరుతున్నారా అని పిటిషనర్లను హైకోర్టు అడిగింది. సీబీఐ విచారణ జరిపించాలని కేఏ పాల్‌తో పాటు ఇతర పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. దీంతో ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. తమ పిటిషన్లను వేరు చేసి విచారణ జరపాలని పలువురు కోరగా అన్నీ కలిపే వింటామని వేర్వేరుగా కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లలో ప్రజా ప్రయోజనం కన్నా రాజకీయ, ప్రచార ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Kaleshwaram Project Issue : ఎన్నికల వేళ ప్రచారం కోసం వేదిక చేసుకోవద్దని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వమే స్వచ్ఛందంగా జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఉన్నతన్యాయ స్థానం ప్రస్తావించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిల్‌పై కేఏ పాల్(KA Paul) స్వయంగా వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని కేఏ పాల్‌ను ప్రశ్నించింది. ఈ అంశంపై అధ్యయనం, పరిశీలన ఎలా ఎప్పుడు చేశారో తెలపాలని కేఏ పాల్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్లన్నింటిపై విచారణను ఈనెల 8కి హైకోర్టు వాయిదా వేసింది.
మురుగునీటితో కూరగాయలు పండిస్తున్నారా? రాష్ట్రప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్టు
సీబీఐ రెడీ : అంతకు ముందు మార్చి 28న కేఏ పాల్ వేసిన పిటిషన్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై నమోదైన కేసుపై విచారణ జరిపి ఏప్రిల్ 2వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన మిగిలిన పిటిషన్లతో పాటు విచారించడానికి సిద్ధంగా ఉన్నామని ధర్మాసనం తెలిపింది. అయితే కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కానీ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే దర్యాప్తు చేస్తామని హైకోర్టుకు వివరించింది. అందుకు తగిన వనరులు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది.
'కాళేశ్వరం' కేసు సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ పిటిషన్ - విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసిన హైకోర్టు