CBI Arrested to Bank Fraud Case Accused : బ్యాంకును మోసగించి ఇరవై ఏళ్లుగా మారు వేషాల్లో తిరుగుతున్న ఓ మోసగాడిని సీబీఐ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వివరాళ్లోకి వెళ్తే, పాతబస్తీ కామటిపురాకు చెందిన చలపతి రావు హైదరాబాద్ చందులాల్ బిరాదారి ఎస్‌బీఐలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. 2002లో అక్కడ పనిచేస్తున్న సమయంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బంధువులకు ఎలక్ట్రానిక్ దుకాణాలకు రుణాలతో పాటు, ఫేక్ శాలరీ సర్టిఫికెట్లు పెట్టి సుమారు రూ.50 లక్షల మోసానికి పాల్పడ్డాడు. కాగా ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసులో భార్యను కూడా నిందితురాలిగా చేర్చింది.
ఘటనపై 2004లో కోర్టులో ఛార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. అయితే 2004 నుంచే తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో తన భర్త కనిపించడం లేదని కామటిపుర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఏడేళ్ల తర్వాత భార్య కోర్టులో ఓ పిటిషన్ సైతం దాఖలు చేసింది. తన భర్త కనిపించకుండా పోయి ఏడేళ్లు పైగా అవుతుందని, చట్టప్రకారం తన భర్తను చనిపోయినట్లు ప్రకటించాలని కోర్టును కోరింది. దీంతో కోర్టు సైతం అదే విధంగా తీర్పునిచ్చింది.
మారువేషాలతో తప్పించుకు తిరుగుతున్న నిందితుడు : కేసులో భాగంగా ఆస్తులు జప్తు చేయకుండా కూడా పిటిషన్ వేసి స్టే తెచ్చుకుంది. కానీ కేసును అంత సులభంగా వదిలిపెట్టని సీబీఐ, అతని కోసం ట్రేస్ చేస్తూనే ఉంది. పేర్లు, ఆధార్ కార్డులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నట్లు గుర్తించింది. హైదరాబాద్ నుంచి పరారైన దగ్గర నుంచి దర్యాప్తు ప్రారంభించగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో కనిపించకుండా పోయిన చలపతి రావు తమిళనాడు సాలెంలో తలదాచుకున్నాడు. వినీత్ కుమార్‌గా పేరు మార్చుకుని 2007లో అక్కడ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వినీత్ పేరుతో ఆధార్ కార్డును పొందాడు. అతని రెండవ భార్య ద్వారా మొదటి భార్య కుమారుడుతో చలపతి రావు (వినీత్ కుమార్) టచ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Accused Arrested in Bank Fraud Case : 2014లో ఎవరికీ చెప్పకుండా బోపాల్ పారిపోయిన చలపతి రావు, అక్కడ లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేశాడు. అక్కడి నుంచి మళ్లీ ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్ వెళ్లి ఓ పాఠశాలలో పని చేశాడు. ఈ సమాచారాన్ని సేకరించిని సీబీఐ అధికారుల బృందం 2016లో రుద్రాపూర్ వెళ్లగా, అక్కడి నుంచి చలపతి రావు పరారయ్యాడు. దీంతో అతని ఆధార్ నంబర్, జీ-మెయిల్ ఐడీలతో గాలింపు ప్రారంభించారు. వివరాల కోసం జీ-మెయిల్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకున్నారు.
ఈ వివరాలతో అతను ఔరంగాబాద్ వేరుల్ గ్రామంలోని ఓ ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అక్కడ స్వామీ విధితాత్మానంద్ తీర్ధగా పేరు మార్చుకున్నట్లు గుర్తించారు. ఇదే పేరుతో అక్కడ కూడా ఓ ఆధార్ కార్డును తీసుకున్నాడు. 2021లో ఆశ్రమాన్ని వదిలి వెళ్లిన చలపతి రావు, అక్కడ రూ.70 లక్షలు మోసం చేసి పరారయ్యాడు. అనంతరం రాజస్థాన్ భరత్‌పూర్‌లో బాబాగానే జులై 8 వరకు ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నిందితుడు చలపతి రావు 8-10 సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించారు.
తనని పట్టుకుంటారని భావించిన చలపతి రావు, సముద్ర మార్గాన శ్రీలంక వెళ్లాలని పథకం వేశాడు. శ్రీలంక వెళ్లేందుకు ముందుగా తమిళనాడులోని నర్సిగనల్లుర్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో ఈ నెల 4న సీబీఐ అధికారులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ చేశారు. దాదాపు 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు.