CAT Rejected Suspension on AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్) కొట్టి వేసింది. రెండోసారి ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఈ సందర్భంగా పేర్కొంది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు 1989లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్‌కు ఎంపికై రాష్ట్ర కేడర్‌కు అలాట్ అయ్యారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఎన్నికల సమయంలో అతనిపై వైసీపీ నేతలు పదే పదే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి ఆ పదవి నుంచి తప్పించేలా చేశారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపులు మొదలుపెట్టారు. నిఘా చీఫ్‌గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి కీలక పరికరాలు కొనుగోలు చేశారని, తమ ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాత మాటమార్చి పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ విచారణ పేరుతో వేధించింది.
తాను ఎలాంటి అవినీతీ చేయలేదని, అసలు పరికరాలే కొనుగోలు చేయలేదంటూ ఏబీవీ ఇచ్చిన వివరణను కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆయన పరిపాలనా ట్రైబ్యునల్, న్యాయస్థానాలను ఆశ్రయించడంతో సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నియమితులయ్యారు. కానీ పోస్టింగ్ ఇచ్చిన రెండు వారాలకే మరో అభియోగంపై సర్కారు సస్పెండ్ చేసింది. తర్వాత వెంకటేశ్వరరావు తీవ్రమైన తప్పు చేశారంటూ అతన్ని సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
2020 డిసెంబరు 18న ఆయనపై విచారణ ప్రారంభించి 2022 అక్టోబరు 21నాటికి పూర్తి చేశామని లభించిన ఆధారాల మేరకు డిస్మిస్ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆధారాల ప్రకారం డిస్మిస్ చేయడం కుదరదంటూ కేంద్ర హోం శాఖ తిరస్కరించింది. అయినా వెనక్కి తగ్గని వైసీపీ ప్రభుత్వం కొత్త ఆధారాలు దొరికాయంటూ అతన్ని డిస్మిస్ చేయాలని మళ్లీ కోరడంతో హోం శాఖ యూపీఎస్సీకి నివేదించింది.
ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన యూపీఎస్సీ ఏ రూల్ కింద డీజీ ర్యాంకు అధికారిని డిస్మిస్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి చేసిన తప్పేంటో, దానిపై విచారణలో తేలింది ఏమిటో ఆయన సమాధానం ఏమిటో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. అభియోగాలు ఎదుర్కొన్న అధికారి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా, సముచిత ఆధారాల్లేకుండా డిస్మిస్ చేయడం సాధ్యం కాదని యూపీఎస్సీ కేంద్రానికి తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వినతిని యూపీఎస్సీ తిరస్కరించిందని అఖిల భారత సర్వీసుల నిబంధనల ప్రకారమే ఆయనపై చర్యలు తీసుకోవాలన్న తన మొదటి సిఫారసును అమలు చేయాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పిటిషనర్ తరఫు న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపించారు. ఒకే కారణంతో ఏబీ వెంకటేశ్వరరావును రెండు సార్లు సస్పెండ్ చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వాదించారు. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసి వాదనలు ముగిసే వరకు సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తీర్పు రిజర్వు చేసి ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
గొడ్డలితో మిగతావాళ్లను నరికేయండి - వైఎస్ భారతిపై షర్మిల ఫైర్ - YS Sharmila comments ys bharathi
వైఎస్సార్సీపీ కుట్రలపై ఏపీ నూతన డీజీపీ కన్ను వెయ్యాల్సిందే! - DGP Focus on AP Election 2024