Cambodia Job Frauds In Telangana : జగిత్యాల జిల్లా వెనుగుమట్లకు చెందిన యువకుడు ఉపాధి నిమిత్తం కోరుట్లకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్‌ను సంప్రదించాడు. అజర్‌బైజాన్‌లో కూలీపని ఇప్పిస్తానని 2022 సెప్టెంబర్‌లో వంశీకృష్ణ బాధితుడి నుంచి 15వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ ఏడాది డిసెంబరులో 2 లక్షలు చెల్లించినా పని కాకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకురాగా చివరకు కంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఉందని గత ఆగస్టులో ఏజెంట్ చెప్పాడు. జెన్-ఈ గ్రూప్ పేరిట ఆఫర్ లెటర్ పంపించగా నవంబర్ 7న బాధితుడు హైదరాబాద్ నుంచి మలేషియా మీదుగా కంబోడియా చేరాడు. ఆ తర్వాత పాస్‌పోర్టు తీసుకోగా ఓ చైనీయుడు ఇంటర్వ్యూ చేశాడు. పది నుంచి పన్నెండు రోజుల తర్వాత పదుల సంఖ్యలో కాల్‌సెంటర్లు నడుస్తున్న భారీ ప్రాంగణానికి తీసుకెళ్లినట్లు బాధితుడు పోలీసులతో గోడు వెల్లబోసుకున్నాడు.
Telangana Youth Trapped in Cambodia : కాల్ సెంటర్‌కి వెళ్లిన బాధితుడికి ఎవరూ సొంత పేర్లు వినియోగించవద్దని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. బాధితుడి పేరు జోష్‌గా మార్చిన నిర్వాహకులు వ్యక్తిగత సమాచారం మరొకరితో పంచుకోవద్దని గుంపులుగా సమావేశాలు జరపవద్దని షరతులు పెట్టారు. నెలకు 600 అమెరికన్ డాలర్లు వేతనం ఇస్తామని చెప్పారు. అక్కడున్న చైనీయులు తరచూ భారత పౌరుల సమాచారాన్ని బాధితుల నుంచి సేకరించేవారని తెలిపాడు. భారతీయ నగరాల ఆర్థిక స్థితిగతులను నోట్ చేసుకునేవారు. అక్కడ సుమారు 5 వేల మంది భారతీయులున్నట్లు బాధితుడు గుర్తించాడు. భారతీయుల్లోనే కొందరిని టీమ్ లీడర్లుగా నియమించి బాధిత యువకులను మాట్లాడుకోనీయకుండా నిఘా ఉంచేవారని బాధితుడు తెలిపాడు.
ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ పేరిట సైబర్ నేరాలు చేయించే బాధ్యతను బాధితులకు అప్పగించారు. తొలుత టెలీకాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయని ఆకర్షించడమే బాధితుల పని. ఒకవేళ ఎవరైనా ఆకర్షితులైతే టీంలీడర్లు రంగంలోకి దిగేవారు. కార్యాలయంలో కేరళకు చెందిన రాబిన్, లోకి, థార్.. తమిళనాడుకు చెందిన రోలెక్స్, బంగ్లాదేశ్‌కు చెందిన డేవిడ్ చైనా దేశస్థుడు ఎరిక్ టీం లీడర్లుగా ఉన్నట్లు బాధితుడు గుర్తించాడు. మొత్తం ఐదు నెలలు పనిచేస్తే మొదటి నెల 360 అమెరికన్ డాలర్లు మూడో నెల 620 డాలర్లు చెల్లించారు. రెండోనెల బాస్ మారాడాని ఏం ఇవ్వలేదు.
Cambodia Crypto Fraud : మిగిలిన మొత్తాన్ని జరిమానా పేరిట కోత విధించారు. సైబర్‌నేరాలపై పోలీసులకు చేరవేస్తే తీవ్రంగా చిత్రహింసలు తప్పవని టీంలీడర్లు తరచూ బాధితుల్ని భయాందోళనకు గురిచేసేవారని పేర్కొన్నాడు. కాల్ సెంటర్లలో పనిచేస్తున్న క్రమంగా తీవ్రమైన చెవినొప్పి రాగా తిరిగి ఇంటికి పంపాలని బాధితుడు పలుమార్లు ప్రాథేయపడగా చివరకు అంగీకరించారు. ఐతే 3 వేల అమెరికన్ డాలర్లు ఇవ్వాలని మెలికపెట్టారు. ఇవ్వకుంటే చంపేస్తామని హెచ్చరించగా జగిత్యాల జిల్లా రాఘవపట్నానికి చెందిన స్నేహితుడిని అడిగాడు. ఆ డబ్బును క్రిప్టోకరెన్సీ రూపంలో పంపించాకే బాధితుడి పాస్‌పోర్టును తిరిగి ఇచ్చి కంబోడియా నుంచి పంపించారు. భారతీయులు, యురోపియన్లు, టర్కీ దేశాల ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మోసాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట చైనీయులు బురిడీ కొట్టిస్తున్నట్లు తేలింది.